Latest News Politics

ఆప్ అలల సవ్వడిలో కేజ్రీ కల్లోలం

కెరటంలా ఎగిసిపడిన ఆప్ లో అలలు కల్లోలం సృష్టిస్తున్నాయి. ఒంటిచెత్తో చీపురు పట్టి దేశరాజకీయాల్లో దుమ్మురేపిన క్రేజీ వాల్ బీటలు వారుతోంది. ఇంటా గెలిచి రచ్చ గెలువాల్సిన నేత…ఢిల్లీలో పాలనపై పట్టుకోల్పోయారు. ఆమ్‌ఆద్మీతో విప్లవాత్మకమార్పులు వస్తాయని ఆశించిన జనం..ఆప్ నేతలు కేసుల్లో ఇరుక్కోవడం చూసి అసహ్యించుకుంటున్నారు. మొన్నటి కార్పొరేషన్ ఎలక్షన్లలో చీపురు పుల్లులు కమలం గాలికి పత్తాలేకుండా కొట్టుపోవడం దీనికి నిదర్శనం.

భారత రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించిన ఆమ్‌ఆద్మీ పార్టీ గ్రాఫ్ క్రమంగా పడుతోంది. 2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీపార్టీ చరిత్ర లిఖించింది.. ప్రత్యామ్నాయ రాజకీయాల పేరుతో దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడిని ఆవిష్కరించింది. మొత్తం 70 స్థానాలకు గాను 67 స్థానాలు సాధించి అనితర విజయాన్ని సాధించింది. అంతకు ముందు 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న బీజేపీకి ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది. ఐపీఎస్‌ మాజీ అధికారిణి కిరణ్‌బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటించినా ఫలితం దక్కలేదు. కేవలం మూడు సీట్లను మాత్రమే గెలుచుకోగలింది. అంతకు ముందు వరుసగా మూడు సార్లు విజయం సాధించి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఒక్క స్థానమూ దక్కలేదు. తాజా ఢిల్లీ మున్సిపల్‌ పోరులో మొత్తం మూడు నగరపాలక సంఘాలను బీజేపీ గెలుచుకోవడంతో ఆమ్‌ఆద్మీకి ఉన్న ప్రజాదరణ తగ్గిపోయిందని స్పష్టంగా అర్థమవుతుంది.
కేజ్రీవాల్‌ ఢిల్లీతో పాటు పంజాబ్‌లోనూ ఆమ్‌ఆద్మీని బలమైన పక్షంగా తీర్చిదిద్దారు. యూపీఏ-2 హయాంలో అవినీతికి వ్యతిరేకంగా సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ప్రారంభించిన జన్‌లోక్‌పాల్‌ ఉద్యమంలో కీ రోల్ ప్లే చేశారు. .అవినీతికి వ్యతిరేక పోరులో కిరణ్‌బేడీ, కేజ్రీవాల్‌, ప్రశాంత్‌భూషణ్‌, యోగేంద్రయాదవ్‌… కీలకపాత్ర పోషించారు.
ఢిల్లీ దేశరాజధాని కావడంతో దేశం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాదిమంది నివాసం ఏర్పరచుకున్నారు. ఎక్కువగా మధ్యతరగతి వారు కావడంతో కేజ్రీవాల్‌ నిజాయితీ పోరును విశ్వసించారు. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీకి పూర్తి మెజార్టీ ఇవ్వకపోయినా అధికసీట్లలో గెలిపించారు. కాంగ్రెస్‌ మద్దతుతో ఏర్పాటైన ప్రభుత్వం 49 రోజుల్లోనే కూలిపోయింది. దీంతో ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్‌పై సానుభూతి పెరిగింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీని అందించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్‌ పార్టీలో కీలకంగా ఉన్న యోగేంద్రయాదవ్‌, ప్రశాంత్‌భూషణ్‌లను బయటకు పంపేశారు. మొదట్లో ప్రజాసంక్షేమ కార్యక్రమాలవైపు మొగ్గు చూపిన కేజ్రీవాల్‌ దేశరాజకీయాల్లో క్రియాశీలకపాత్ర పోషించాలని ఆశించారు. అయితే ఎలాంటి క్షేత్ర ప్రణాళిక లేకుండానే బరిలోకి దిగారు. పంజాబ్‌ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ఆశించినా ఫలితాలు వ్యతిరేకంగానే వచ్చాయి.
ఢిల్లీలో మధ్యతరగతి ప్రజలతోపాటు పేదలు ఎక్కువగా ఉన్నారు. సంక్షేమ పథకాలపై పూర్తిగా దృష్టిపెట్టకుండా కేజ్రీవాల్‌ దేశరాజకీయాలపై నజర్ పెట్టడంతో ఓటర్లలో మార్పువచ్చింది. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే అనేకమంది ఆప్‌ ఎమ్మెల్యేలు, మంత్రులపై ఆరోపణలు రావడం వారిలో కొందరిపై కేసులు పెట్టడం జరిగింది. దీంతో పాటు ఇతర ఆప్‌ నేతలపై నమ్మకం సడలిపోయింది.
ఢిల్లీలో పూర్వాంచల్‌ వాసుల జనాభా సంఖ్య ఎక్కువ. దీన్ని గ్రహించిన బీజేపీ చీఫ్ అమిత్‌షా ఎంపీ మనోజ్‌ తివారీని ఢిల్లీ శాఖ అధ్యక్షునిగా నియమించారు. దీనితో పాటు ప్రధాని మోదీ పాలన ప్రజలను ఆకట్టుకుంది. ఆమ్‌ఆద్మీ నేతలు కేవలం ప్రకటనలతో కాలం గడుపుతూ ప్రజాహిత కార్యాలకు దూరంగా వెళ్లిపోవడాన్ని గమనించారు. మోదీ నేతృత్వంలోని బీజేపీకి మద్దతు పలికారు. ఫలితంగా మూడు నగరపాలక సంస్థల్లోనూ బీజేపీ ఘనవిజయం సాధించింది.

ఆమ్‌ఆద్మీ పతనం ఆ పార్టీ నేతల స్వయంకృతం. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్‌ ఢిల్లీ పాలనపై కాకుండా దేశ రాజకీయాలపై దృష్టిపెట్టారు. దీంతో పాలనపై పట్టుకోల్పోయారు. నిత్యం లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో పాటు కేంద్రంతో కయ్యానికి దిగడంతో ప్రతిష్ట దిగజారింది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అనేకమంది పలుకేసుల్లో ఇరుక్కున్నారు. ఆమ్‌ఆద్మీతో విప్లవాత్మకమార్పులు వస్తాయని ఆశించిన ప్రజలు ఈ చర్యలపై నిరసన వ్యక్తంచేశారు. మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.