Latest News

ఆసుపత్రి బిల్లు చెల్లించ‌కున్నా.. పేషెంట్‌ను బంధించొద్దు…

కార్పొరేట్ , సూపర్ సెష్పాలిటీ హాస్పిటల్స్ కు వెళితే రోగాలు తగ్గేదెమో కానీ బిల్లులు దడ పుట్టించేలా ఉంటాయి. అడ్మిట్ అయిన పేషెంట్ డిశ్చార్జ్ అయ్యేవరకు రూమ్ రెంట్లు, రిపోర్ట్ లు , టెస్టుల పేరిట వేలకు వేలు వేస్తుంటారు. రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేయాల్సిన పేషెంట్లను… బిల్లుల కోసం మరో మూడు,నాలుగు రోజులు అదనంగా ఉంచుకునే ఆసుపత్రులూ ఉన్నాయి. చివరకు నయా పైసాతో సహా బిల్లు చెల్లిస్తేనే పేషెంట్ ను కదలనిస్తారు. లేదంటే అక్కడే ఉండిపోవాల్సిందే. ఇలాంటి ఆసుపత్రులకు ఢిల్లీ హైకోర్టు దిమ్మ దిరిగే ఝలక్ ఇచ్చింది.
హాస్ప‌ట‌ల్లో బిల్లులు క‌ట్ట‌లేని పేషెంట్ల‌ను బంధించడం స‌రికాదు అని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయ‌ప‌డింది. చికిత్స రుసుము చెల్లించేంత వ‌ర‌కు రోగిని హాస్ప‌ట‌ల్లోనే ఉంచుకోరాదు అని కోర్టు ఓ కేసులో పేర్కొంది. పేషెంట్‌ను క‌స్ట‌డీలోకి తీసుకునే ప్ర‌క్రియ‌కు హాస్ప‌ట‌ళ్లు స్వ‌స్తి ప‌ల‌కాల‌ని హైకోర్టు ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది. విపిన్ సంఘీ, దీపా శ‌ర్మ‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పును వెలువ‌రించింది. ఒక‌వేళ చికిత్స పొందిన రోగి బిల్లులు చెల్లించ‌కున్నా, వాళ్ల‌ను నిర్ణీత స‌మ‌యంలోగా విడుద‌ల చేయాల‌ని ధ‌ర్మాస‌నం పేర్కొంది. బిల్లు కట్టకున్నా పేషెంట్‌ను బంధించిరాదు అని, ఇలాంటి వ్య‌వ‌హారాలు స‌రికాదు అని కోర్టు వెల్ల‌డించింది. ఢిల్లీలోని శ్రీగంగారామ్ హాస్ప‌ట‌ల్‌పై మ‌ధ్య‌ప్ర‌దేశ్ వ్య‌క్తి దాఖ‌లు చేసిన కేసులో కోర్టు ఈ తీర్పును వెలువ‌రించింది. పేషెంట్ డిశ్చార్జ్ స‌మ్మ‌రీ త‌యారు చేసి అత‌న్ని రిలీజ్ చేయాల‌ని కోర్టు ఆదేశించింది. ఫిస్టులాతో బాధ‌ప‌డుతున్న త‌న తండ్రిని మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ పోలీస్ ఢిల్లీ హాస్ప‌ట‌ల్లో చేర్పించాడు. స‌ర్జ‌రీ త‌ర్వాత‌ ఆ పేషెంట్‌కు 17 ల‌క్ష‌ల బిల్లు వేశారు. అందులో పేషెంట్ కేవ‌లం 4 ల‌క్ష‌లు మాత్ర‌మే చెల్లించాడు. అయితే పేషెంట్‌ను ఇంటికి పంపించేందుకు హాస్ప‌ట‌ల్ వ‌ర్గాలు నిరాక‌రించాయి. దీంతో పేషెంట్ కుమారుడు కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశాడు.