Featured2 Latest News

ఆ జవాన్ కుమార్తెను దత్తత తీసుకుంటామన్న ఐఏఎస్ దంపతులు

 

 

 

 

 

పాక్‌ అకృత్యానికి అమరుడైన బీఎస్‌ఎఫ్‌ జవాను సుబేదార్‌ పరంజీత్‌ సింగ్‌ కుమార్తెను దత్తత తీసుకుంటామని హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్‌ దంపతులు ముందుకు వచ్చారు. ఈ నెల 1న నియంత్రణ రేఖ దగ్గర ఆయన్ను అత్యంత క్రూరంగా హతమార్చిన సంగతి తెలిసిందే. అమరుడైన పరంజీత్‌ కుమార్తె కుష్దీప్‌ కౌర్‌ పాఠశాల విద్య నుంచి ఆమె పెళ్లి వరకు అయ్యే ఖర్చులన్నీ తామే చూసుకుంటామని కులు డిప్యూటీ కమిషనర్‌ యూనస్‌ఖాన్‌.. ఆయన సతీమణి ఐపీఎస్‌ అధికారిణి అంజుమ్‌ అరా తెలిపారు.

‘కుష్దీప్‌ కావాలంటే తన కుటుంబంతోనే ఉండొచ్చు. ఆమె చదువుకు అయ్యే ఖర్చులన్నీ మేమే పెట్టుకుంటాం. తనతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఆమెకు ఎమైనా సమస్యలు ఉన్నాయన్నది తెలుసుకుంటాం. ఆమె ఏం చదవాలనుకుంటే అందుకు మేం అండగా ఉంటాం’ అని అరా అన్నారు.
‘అమరజవాను పరంజీత్‌ కుటుంబానికి ఎదురైన కష్టాన్ని తగ్గించడం సాధ్యమయ్యేది కాదు. కానీ వారి బాధను పంచుకునేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఆయన కుమార్తెకు చక్కటి విద్య.. భవిష్యత్‌ను అందజేయాలని అనుకుంటున్నాం. బాధ్యతగల పౌరులుగా మేం మా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాం. కుష్దీప్‌ తన చదువును ఆమె గ్రామంలోని పాఠశాలలో కొనసాగించొచ్చు లేదంటే స్కూల్‌ మారతామన్నా మాకెలాంటి అభ్యంతరం లేదు. ఆమె వెన్నంటే ఉంటూ తన జీవితానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవడంలో అండగా ఉంటాం’ అని యూనస్‌ హామీ ఇచ్చారు.