Latest News

ఆ బ్యాంకులో నో క్యాష్..ఓన్లీ చెక్స్..!

ఏ బ్యాంకుకు వెళ్లిన మిలమిల మెరిసే నోట్లు కనిపిస్తాయ్. ఖాతాదారులు వేయడం తీయడం చేస్తుంటారు. ఆ బ్యాంకులో మాత్రం నగదు అసలు ఇవ్వరు..తీసుకోరు కూడా. అన్ని చెక్కుల్లో రూపంలోనే జరుగుతాయి. ఇలా ఎందుకు చేస్తున్నారంటే…

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు వరుస దోపిడీలతో భయపడిపోయిన బ్యాంకు సిబ్బంది నగదు లావాదేవీలను ఆపేవేశారు. దక్షిణ కశ్మీర్‌లోని 40 బ్రాంచ్‌ల్లో నగదు లావాదేవీలు నిలిపివేసినట్లు సీనియర్‌ బ్యాంకు అధికారి వెల్లడించారు. ఒక వేళ ఖాతాదారుడు నగదు డిపాజిట్‌ చేయాలనుకుంటే చెక్కు రూపంలోనే చేయాలని, నగదు బదిలీ చేయాలన్నా ఈ పద్ధతిలోనే చేయాల్సి ఉంటుందన్నారు. నగదు లావాదేవీలు మినహా మిగతా అన్ని పనులు యథాప్రకారం జరుగుతాయని స్పష్టం చేశారు. నగదు కావాల్సి వస్తే బ్యాంకు ఖాతాదారులు దగ్గర్లోనే సురక్షితమైన బ్రాంచ్‌ల్లో సంప్రదించాలన్నారు. పుల్వామా, షోపియన్‌ జిల్లాలకు చెందిన బ్యాంకుల్లోనే ఎక్కువగా నగదు లావాదేవీలు నిలిపివేశారు.
వారం రోజుల్లోనే నాలుగు బ్యాంకులు, నగదు వ్యానుపై ఉగ్రవాదులు దాడులు చేసి నగదును దోచుకున్నారు. రెండు రోజుల క్రితం కేవలం రెండు గంటల వ్యవధిలోనే వేర్వేరు బ్యాంకుల్లో ఉగ్రవాదులు తుపాకీలతో సిబ్బందిని బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌, లష్కరే తోయిబా సంస్థలకు చెందిన ఉగ్రవాదులు ఈ దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.