Latest News Technology

ఇక జియో బ్రాడ్‌బ్యాండ్ బాజా..!

4జీ తో టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయెన్స్ జియో ఇకపై జియో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సంస్థలకు గట్టి షాకే ఇవ్వబోతోంది. జియో ఫైబర్ పేరిట మరో రెండు నెలల్లో సరికొత్త, అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను యూజర్లకు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది.

‘ఫైబర్-టు-ద-హోమ్ (Fibre-to-the-Home (FTTH))’ పేరిట రిలయన్స్ జియో తీసుకురానున్న ‘జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్’ ముందుగా మెట్రో నగరాల్లోని వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ నగరాలతోపాటు గుజరాత్‌లోని జియో హోమ్ టౌన్ జామ్ నగర్‌లోనూ జియో ఫైబర్ ముందుగా అందుబాటులోకి వస్తుంది. ఆ తరువాత దేశంలో ప్రముఖ పట్టణాలకు విస్తరించనుంది. ఆతర్వాత గ్రామాల్లో కూడా జియో ఫైబర్‌ను ప్రవేశపెట్టనున్నారు.
తొలి 3 నెలలు ఫ్రీ…
జియో తన జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను మొదటి మూడు నెలల పాటు యూజర్లకు ఉచితంగా అందివ్వనుంది. ఆ సమయంలో యూజర్లు గరిష్టంగా 100 ఎంబీపీఎస్ స్పీడ్‌ను పొందవచ్చు. అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఆ తరువాత రూ.500, రూ.2వేల ప్లాన్లు రెండింటిని ముందుగా ప్రవేశపెట్టనున్నారు. రూ.500 ప్లాన్‌తో 600 జీబీ డేటా ఉచితంగా వస్తుంది. రూ.2వేల ప్లాన్‌తో 1000 జీబీ డేటా వస్తుంది. ఈ రెండు ప్లాన్లలోనూ యూజర్లు గరిష్టంగా 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెట్‌ను బ్రౌజింగ్ చేసుకోవచ్చు. అయితే నిర్దేశించిన డేటా లిమిట్ పూర్తయితే స్పీడ్ తగ్గుతుంది.
100 ఎంబీపీఎస్ స్పీడ్ ఉంటే…
జియో ఫైబర్ అందించనున్న 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్‌తో 5జీబీ సైజ్ గల హెచ్‌డీ సినిమాను కేవలం 6 నిమిషాల్లోనే డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుంటుంది. అదేవిధంగా 5 ఎంబీ సైజ్ గల 100 పాటలను కేవలం 24 సెకన్లలోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతటి వేగాన్ని జియో ఫైబర్ ఇవ్వనుంది. ఇప్పటికే ఎయిర్‌టెల్, యాక్ట్, హాత్‌వే వంటి ప్రముఖ సంస్థలతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్ కూడా బ్రాడ్‌బ్యాండ్ సేవలను వినియోగదారులకు అందిస్తున్నాయి. ఇక జియో ఫైబర్ వస్తే ఈ సంస్థలు ఎలాంటి ఆఫర్లను ఇస్తాయో చూడాలి.