Latest News Social

ఇసుకేస్తే రాలనంత మంది హిజ్రాలు…

తమిళనాడులోని విల్లుపురం జిల్లా ఉళుందూర్‌పేట సమీపంలో కువాగం కూత్తాండవర్‌ ఆలయ వైశాఖ పౌర్ణమి రథోత్సవం కోలాహలంగా జరిగింది. భక్తుల దివ్యనామ స్మరణ, చిన్నారుల భజనలు, కళాకారుల విన్యాసాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల మధ్య అలంకరించిన రథాన్ని హిజ్రాలు లాగారు. కువాగం గ్రామంలో వెలసిన కూత్తాండవర్‌ ఆలయంలో ప్రతి యేటా చిత్తిరై ఉత్సవాలు పదిరోజులపాటు జరుగుతాయి. ఈ యేడు ఉత్సవాలు ఈనెల 1న ప్రత్యేక పూజలతో ప్రారంభం కాగా, ప్రధాన ఉత్సవంలో హిజ్రాలు ఆలయ పూజారిచే తాళి కట్టించుకొని మంగళవారం రాత్రి 8 నుంచి తెల్లవారుజాము వరకు ఆడుతూ, పాడుతూ సరదాగా గడిపారు. ఇందులో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ముంబై రాష్ట్రాల నుంచే కాకుండా సింగపూర్‌, మలేషియా దేశాల నుంచి హిజ్రాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బుధవారం ఉదయం వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఆలయ గర్భగుడిలో కొలువుదీరిన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను సర్వాలంకరణలతో రథంపై ఆశీనులను గావించారు. ఉదయం 6 గంటలకు భక్తులతో పాటు హిజ్రాలు భక్తిప్రపత్తులతో రథానికిరువైపులా ఉన్న భారీ తాళ్లను చేతపట్టుకొని లాగుతూ వెళ్లారు. రథం బందలాడి ప్రాంతానికి చేరుకున్న సమయంలో హిజ్రాలు తాళి తెంచుకొని, గాజులు పగులగొట్టుకొని, నుదుట తిలకాన్ని చెరిపేసుకొని, వితంతువులుగా మారి భోరున విలపించారు. గంట తర్వాత మళ్లీ ఆలయం దగ్గరకు చేరుకొని మొక్కులు చెల్లించుకున్నాక స్వస్థలాలకు తిరిగివెళ్లారు.