Featured Latest News Social Technology

ఈఫిల్ టవర్ కంటే పెద్దది…

 

 

 

 

 

 

 

 

 

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించేందుకు భారత రైల్వేశాఖ సన్నాహాలు చేపట్టింది. జమ్ముకశ్మీర్‌లోని చినాబ్‌ నదిపై నిర్మించ తలపెట్టిన ఈ వంతెనను రెండేళ్లలో పూర్తి చేస్తారు. నది ఉపరితలం నుంచి 359 మీటర్ల పైన ఉండే ఈ వంతెన ఈఫిల్‌ టవర్‌ కంటే 35 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. రూ. 1100కోట్లతో అర్ధ చంద్రాకారంలో 1.315 కిలోమీటర్ల బ్రిడ్జ్‌ను ఏర్పాటుచేయనున్నారు. ఇందుకోసం 24వేల టన్నుల స్టీల్‌ను ఉపయోగించనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.

కత్రాలోని బక్కాల్‌, శ్రీనగర్‌లోని కౌరీ ప్రాంతాలను కలుపుతూ ఈ వంతెన నిర్మిస్తారు. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను, మైనస్‌ 20 డిగ్రీల వాతావరణాన్ని తట్టుకునేలా ఈ బ్రిడ్జ్‌ను రూపొందిస్తారు. బ్రిడ్జిలో ఉండే సెన్సార్ల సాయంతో గాలి వేగాన్ని గుర్తిస్తారు. 90 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ గాలులు వీస్తే.. రైల్వే ట్రాక్‌ ఎరుపురంగులోకి మారి సిగ్నల్‌ అందిస్తుంది. అంతేగాక, జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బ్రిడ్జిను 63ఎంఎం మందంతో బ్లాస్ట్‌ ప్రూఫ్‌ స్టీల్‌తో నిర్మిస్తున్నారు.
అయితే అక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ వంతెన నిర్మాణం కశ్మీర్‌ రైల్‌ లింక్‌ ప్రాజెక్ట్‌కు సవాల్‌తో కూడిన అంశమే అయినా రెండేళ్లలో బ్రిడ్జి పూర్తిచేస్తామని సీనియర్‌ రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు. ఇంజినీరింగ్‌ చరిత్రలో ఇదో అద్భుతంగానూ, కశ్మీర్‌కు పర్యాటక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. 2019లోగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ బ్రిడ్జి పూర్తయితే చైనాలోని 275 మీటర్ల షుబ్‌బై రైల్వే వంతెన కంటే ఎత్తైనదిగా గుర్తింపు సాధిస్తుంది.