Latest News

ఈ ‘పెద్దోళ్ల’ పిల్లలే ఎందుకిలా..?

స్పీడ్ థ్రిల్స్..బట్ కిల్స్ … అర్ధరాత్రి, అపరాత్రుళ్లు హైదరాబాద్ రోడ్లపై ‘స్పీడ్ టెస్టింగ్‌’లకు పెద్దోళ్ల పిల్లలు బలవుతున్నారు. మొన్న అజారుద్దీన్ కొడుకు ఆతర్వాత కోమటిరెడ్డి కుమారుడు, అంతకుముందు కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్ల కొడుకులు అందరూ వీవీఐపీలే! అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. అన్నీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాలే! తేడా ఏంటంటే కొంతమంది బైక్ ప్రమాదాల్లో మరణిస్తే, మరికొంతమంది ఖరీదైన కారు ప్రమాదాల్లో చనిపోయారు. ఈ మరణాలకు గల కారణాలు రెండే రెండు. మొదటిది మితిమీరిన వేగమైతే, రెండోది మద్యపానం. ఈ ప్రమాదంలో ఎక్కువభాగం అర్ధరాత్రి దాటిన తర్వాతో లేదా ఏ తెల్లవారుజామునో జరిగాయి. .

పైగా వాహనాలు నడిపేవారు మద్యం ప్రభావానికి లోనై వుండడం ఒక ప్రధాన కారణం. ఆ మధ్య బీటెక్ కుర్రాళ్లు బంజారాహిల్స్‌లోని ఓ రెస్టారెంట్లో పార్టీ చేసుకుని రోడ్ నెంబరు 3లోని నాగార్జున సర్కిల్ రోడ్డుకు అవతల వైపునున్న మరో వాహనాన్ని ఢీకొట్టి అభంశుభం ఎరుగని ఎనిమిదేళ్ల బాలికను పొట్టనపెట్టుకున్నారు.
ఇంకా ఈ మధ్య జరిగిన మరో కేసులో బర్త్ డే పార్టీ చేసుకున్న కొంతమంది ఇంజనీరింగ్ కుర్రాళ్లు తమ సహచర విద్యార్థిని మృతికి కారణమయ్యారు. ఈ ప్రమాదం కూడా జూబ్లీహిల్స్ లోనే జరిగింది.
కొంతకాలం క్రితం ఇదే విషయమై సిటీ పోలీసులు.. అధిక వేగంతో వాహనాలు నడిపి పట్టుబడిన యువకులకు, వాళ్ల పేరెంట్స్‌కి కౌన్సెలింగ్ ఇచ్చారు. లైసైన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. కానీ, ఎన్ని నియంత్రణలు చేపట్టినా ఫలితాలు రావడంలేదని పోలీసుబాసులు చెబుతున్నారు. తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం, పిల్లలకు పెద్ద వాహనాలిచ్చి చూసీచూడనట్టు వదిలేయడం ఇటువంటివి ప్రమాదాలకు కారణమవుతున్నారన్నది తరచు వినిపిస్తోన్న ఆరోపణలు.

ఇక మంత్రి నారాయణ కుమారుడి వాహనం ఒక టాప్ మోడల్ బెంజ్ కారు. ఇది ప్రమాదానికి గురైంది. సాధారణంగా ఇటువంటి వాహనాలు ప్రమాదానికి గురైనప్పుడు బెలూన్స్‌తోపాటు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ అన్నీవుంటాయి. అయినప్పటికీ ఈ ప్రమాదం జరిగిందంటే అందుకు కారణం ఏమై వుంటుంది? జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లో మెట్రోపనులు జోరుగా సాగుతున్నాయి. ఈ పిల్లర్ల పక్కనుంచి వాహనాన్ని అత్యంత వేగంగా నడపడం కూడా ప్రమాదానికి కారణంగా కనిపిస్తోంది. పైగా సీటు బెల్ట్ పెట్టుకోలేదని చెబుతున్నారు. వాహనంలో దొరికిన మద్యం బాటిళ్లు పరిస్థితిని చెప్పకనే చెబుతున్నాయి. మొత్తమ్మీద ప్రమాదానికి కారణంగా భావిస్తున్న రెండు విషయాలు.. మితిమీరిన వేగం, మద్యం తాగిన వాహనం నడపడం కూడా!
ఈ పరిస్థితులు మరింత చేజారకుండా వుండాలంటే కఠిన నిబంధనలతోపాటు తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల సహకారం కూడా ఎంతో అవసరమన్నది నిపుణుల వాదన. మంత్రి కొడుకైనా, మారాజుల బిడ్డలైనా ఇటువంటి మరణాలు విషాదకరం. ఇక ముందైనా ఇలాంటి ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు తీసుకోవాలి. స్పీడ్ థ్రిల్స్..బట్ కిల్స్ . డ్రెంకెన్ డ్రైవ్ ఈజ్ వెర్రి డేంజరస్ అని విస్తృతంగా ప్రచారం చేయాలి.