Technology Trends

ఏడాదికో మారు భారత్ వస్తా: గేట్స్

ఏడాదికి ఒకసారైనా భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా’నని , మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ అంటున్నారు. ఆయన గతేడాది చివర్లో భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా తన అనుభవాలను ట్విటర్లో పంచుకున్నారు గేట్స్‌. ‘ఏడాదికోసారైనా భారత్‌కు రావాలనుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ ఓ కొత్త విషయం నుంచి స్ఫూర్తి పొందుతున్నా’ అని గేట్స్‌ ట్వీట్‌ చేశారు. భారత్‌ పర్యటన సందర్భంగా ఇండియాగేట్‌ దగ్గర ఆటోలో ప్రయాణించిన ఫొటోను కూడా పోస్టు చేశారు. అంతేగాక, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసల వర్షం కురిపించారు బిల్‌గేట్స్‌. ప్రధాని మోదీపై ఇటీవల తన బ్లాగులో రాసిన పోస్టు లింక్‌ను గేట్స్‌ షేర్‌ చేశారు.

‘‘మోదీ స్వచ్ఛభారత్‌ గురించి మాట్లాడుతూ.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మహిళలకు కనీస సౌకర్యాలు లేవు. వారు బహిర్భూమికి వెళ్లాలంటే చీకటిపడేవరకు ఆగుతారు. అది వారి ఆరోగ్యానికి ఎంత నష్టం కలిగిస్తుందో తెలుసా? మన తల్లులు, సోదరీమణుల ఆత్మగౌరవాన్ని మనం కాపాడలేమా. వారికి టాయిలెట్స్‌ కట్టించలేమా? అని మోదీ ప్రశ్నించారు. మహిళలకు సంబంధించి ఈ సున్నితమైన అంశాన్ని ఓ దేశ నాయకుడు అంత స్పష్టంగా, బహిరంగంగా చెబుతాడని నేను వూహించలేదు. కానీ మోదీ చెప్పగలిగారు. స్వచ్ఛభారత్‌ గురించి ఇంకో ఆనందకరమైన విషయమేంటంటే.. దేశంలోని ఓ పెద్ద సమస్యను గుర్తించడమేగాక, దాని కోసం అందరూ సమిష్టిగా పనిచేస్తున్నారు’ అని గేట్స్‌ కొనియాడారు. గేట్స్‌ ట్వీట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.