Politics

‘ఐటీ + ఐటీ =ఇండియా టుమారో’

ప్రతి ఒక్కరూ సాంకేతికతను ఉపయోగించుకోవాలని అప్పుడే డిజిటల్‌ ఇండియా సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. అత్యున్నత న్యాయస్థానానికి చెందిన ఇంటిగ్రేటెడ్‌ కేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను ఆయన ప్రారంభించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్‌ ఖేహార్‌ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ ఈ ఆన్‌లైన్‌ సేవలను ప్రారంభించారు. టెక్నాలజీ అనేది ఒక్క హార్డ్‌వేర్‌కు మాత్రమే పరిమితం కాదన్నారు.
ఇ-గవర్నెన్స్‌ చాలా సులభమైన, సమర్థవంతమైన పద్ధతి అని, కాగిత రహిత పాలనతో పర్యావరణాన్ని కూడా పరిరక్షించొచ్చని చెప్పారు. ‘ఐటీ + ఐటీ = ఐటీ అంటే.. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ + ఇండియన్‌ టాలెంట్‌ = ఇండియా టుమారో’ అని మోదీ వ్యాఖ్యానించారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఖేహార్‌ మాట్లాడుతూ.. 24 రాష్ట్రాల హైకోర్టులు, సబ్‌ఆర్డినేట్‌ కోర్టులతో కలిసి ఈ ఇంటిగ్రేటెడ్‌ సిస్టమ్‌ను ప్రతిపాదించినట్లు చెప్పారు. కేసుల్లో పారదర్శకంగా వ్యవహరించేందుకు ఈ సిస్టమ్‌ పనిచేస్తుందన్నారు. కోర్టు ఫీజులు కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించొచ్చని చెప్పారు. కేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌తో బార్‌కు లాభదాయకమే అంతేగానీ వర్క్‌లోడ్‌ ఏమాత్రం పెరగబోదని ఖేహార్‌ చెప్పారు.
డిజిటల్‌ ఇండియాలో భాగంగా కాగిత రహితం దిశగా వెళ్తొన్న సుప్రీంకోర్టు.. నేడు ఇంటిగ్రేటెడ్‌ కేస్‌ మేనేజ్‌మెంట్‌ సేవలను ఆరంభించింది. ఇక వాజ్యదారులు తమ కేసుకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా తెలుసుకునేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది.