Sports

ఐపీఎల్‌కి స్మిత్‌ వారం దూరం

దిల్లీ: ఐపీఎల్‌-10వ సీజన్‌లో రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌ సారథి స్టీవ్‌ స్మిత్‌ కొన్ని రోజులు దూరం కాబోతున్నాడు. ఈ విషయాన్ని స్మిత్‌ స్వయంగా సోషల్‌మీడియా ద్వారా ప్రకటిస్తూ.. కుటుంబసభ్యులతో గడిపేందుకు దుబాయ్‌ వెళ్తున్నట్లు తెలిపాడు.
ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించింది. దీంతో సుదీర్ఘ కాలం పాటు ఆసీస్‌ ఆటగాళ్లు కుటుంబసభ్యులకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో స్మిత్‌ కొన్ని రోజుల పాటు కుటుంబసభ్యులతో గడిపేందుకు దుబాయ్‌ వెళ్తున్నట్లు వెల్లడించాడు. సుమారు ఆరు రోజులు ఐపీఎల్‌కు తాను దూరం కానున్నట్లు తెలిపాడు. దీంతో పుణె తదుపరి ఆడే రెండు మ్యాచ్‌లకు స్మిత్‌ దూరం కానున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో తలపడిన పుణె కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించి… పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది.