Latest News

కాటేసిన నాగుపాముతోనే ఆసుపత్రికి..!

పాము కరిస్తే.. ఉరుకులు పరుగులు పెడుతాం.ప్రాణాలు దక్కించుకునేందుకు హాస్పిటల్ కు పోతాం..కానీ ఓ వ్యక్తి కాటేసిన నాగుపామునే పట్టుకుని ఆసుపత్రికెళ్లాడు. చికిత్స కోసం అర్ధరాత్రి వేళ హాస్పిటల్‌కు రావడంతో వైద్యసిబ్బంది గుండెలదిరిపోయాయి. భయం..భయంగానే అతడికి వైద్యం చేశారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రికి వెళ్లాడు.
చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం తెల్లనీళ్లపల్లెకు చెందిన రమణ కూలిపనులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలాగే, ఇళ్లల్లో చొరబడిన పాములను పట్టి దూరంగా వదిలేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 11.45 గంటల సమయంలో చిట్రెడ్డిపల్లెకు చెందిన రామకృష్ణ తమ ఇంటిలో నాగుపాము చొరబడిందని, దానిని పట్టాలంటూ రమణను తీసుకెళ్లాడు. పామును పట్టే క్రమంలో రమణ దాని కాటుకు గురయ్యాడు. అయినప్పటికీ అతను అధైర్యం పడలేదు. పాము తలను ఎడమచేతితో బలంగా అదిమి పట్టడంతో అది బలంగా చేతిని చుట్టుకుంది.

బైక్ పై రెండు కిలోమీటర్ల దూరంలోని చౌడేపల్లె ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే అర్ధరాత్రి దాటింది. పామును ఒడిసిపట్టుకుని వచ్చిన రమణను చూసి డ్యూటీ నర్స్‌ అరుణ హడలిపోయి పరుగులు తీశారు. చివరకు భయపడుతూనే అరుణ అతడికి పాము విరుగుడుకు ఇంజెక్షన్‌ వేశారు. ఆ తర్వాత పామును రమణ చంపేశాడు.
ఆపై108లో పుంగనూరుకు చేరుకున్నాడు. అక్కడి నుంచి 45 కిలోమీటర్ల దూరంలో పాము కాటు చికిత్సకు పేరున్న శివాడికి ప్రైవేటు వాహనంలో రమణను రామకృష్ణ తరలించాడు. . తాను ఇప్పటివరకు 300 పైచిలుకు పాములు పట్టానని, 15సార్లు పాముకు గురయ్యానని రమణ చెబుతున్నాడు.