Politics

కేజ్రీవాల్ కు షాక్ మీద షాక్

చిక్కుల్లో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ మరో ఇరకాటంలో పడింది. వరుస వివాదాలు, సమస్యలను ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా 2015 ఎన్నికల్లో ఆప్‌కు వచ్చిన రూ.2కోట్ల విరాళాల లెక్కను తెలియజేయాల్సిందిగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ విరాళాలకు సంబంధించిన లెక్కలను ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ చెప్పలేదని ఐటీ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే విదేశాల నుంచి ఎవరెవరు ఎంతెంత విరాళాలను ఏ రూపంలో ఇస్తున్నారో తెలపాల్సిందిగా గత వారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు ఆప్‌కు నోటీసులు జారీ చేశారు.

ఢిల్లీ పురపాలక ఎన్నికల అనంతరం ఈవీఎంలపై సీఎం కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేత కుమార్‌ విశ్వాస్‌ విభేదించారు. ఆయన పార్టీని వీడతారని జోరుగా ప్రచారం నడిచిన నేపథ్యంలో ఇరు నేతలు కూర్చొని మాట్లాడుకోవడంతో సమస్య సద్ధుమణిగింది. ఈ వివాదం ముగిసింది అనుకునేలోపే కపిల్‌ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించడంతో మరో సమస్య వచ్చిపడింది. ‘ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ దగ్గర నుంచి కేజ్రీవాల్‌ రూ.2కోట్లు ముడుపులు తీసుకున్నారని, అందుకు ప్రత్యక్ష సాక్షిని నేనే’ అంటూ కపిల్‌ మిశ్రా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలా వరుసగా వచ్చి పడుతున్న సమస్యలతో కేజ్రీవాల్ కోలుకోలేని కష్టాల్లో పడ్డారు.