Politics

కేరళ సీఎంకు సుప్రీం షాక్

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సుప్రీం కోర్టు ఝలక్ ఇచ్చింది. మాజీ డీజీపీ టీపీ సేన్‌కుమార్‌ను మళ్లీ పునర్నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రస్తుత పోలీస్ చీఫ్ లోక్‌నాథ్ బెహెరా పదవి నుంచి దిగిపోక తప్పని పరిస్థితి నెలకొంది. సేన్‌కుమార్‌ను తప్పించడం ఏకపక్ష నిర్ణయమనీ, చట్టవ్యతిరేకమని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. తనను పదవినుంచి పక్కనబెట్టడంపై సేన్‌కుమార్ వేసిన పిటిషన్‌ను జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం విచారించింది.

తీర్పు వెలువడిన అనంతరం సేన్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి ఇబ్బందులు పడుతున్న అనేకమంది పోలీసు అధికారులకు ఈ తీర్పు సహాయపడుతుంది. నాకు అండగా నిలిచిన న్యాయవాదుల బృందానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా..’’ అని అన్నారు.. గతేడాది కొత్తగా అధికారంలోకి వచ్చిన విజయన్ ప్రభుత్వం వస్తూ వస్తూనే డీజీపీ సేన్‌కుమార్‌ను పక్కనబెట్టింది. జిషా హత్యకేసుతో పాటు, పుట్టింగల్ దేవాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఆయన సరిగా చర్యలు తీసుకోలేదని చెబుతూ మే 2016లో పదవి నుంచి తొలగించింది. పోలీసు హౌస్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ హెడ్‌గా బదిలీ చేసింది. అయితే ఆ బాధ్యతలు స్వీకరించకుండా సేన్‌కుమార్ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.