Featured Politics

చిల్లీ పాలిటిక్స్..!

 

 

 

 

 

 

 

 

 

 

 

చిల్లీ పాలిటిక్స్ స్పైసీగా సాగుతున్నాయి. బస్తాలు విప్పకుండానే మిర్చి ఘాటు నషాళానికి అంటుతోంది. ధర అమాంతం తగ్గించి రైతు కంట్లో దళారులు కారం కొడితే…ఆదుకోవాల్సిన అధికార, విపక్షాలు సిల్లీగా చిల్లీ పాలిటిక్స్ మొదలెట్టాయి. మైలేజ్ కోసం మార్కెట్ లో కుస్తీ పడుతున్నాయి. క్వింటాల్
మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ రూ.6250 ఇచ్చి కొంటామని కేంద్రం చెబుతుండగా మిలీనియం జోక్ అని తెలంగాణ సర్కార్ అంటోంది. ఎవరి మాటలెలా ఉన్నా రైతు కంట్లో మాత్రం దళారుకంటే ఎక్కువగా కారం కొడుతున్నారు నేతలు.
తెలుగురాష్ట్రాల్లో మిర్చి ధర ఒక్కసారిగా పడిపోయింది. దళారులు కుమ్మక్కై క్వింటాల్ ధరను వెయ్యి రూపాయలకు తగ్గించేశారు. కడపు మండిన రైతులు మార్కెట్లలో తిరగబడితే.. మరికొందరు పొలాల్లోనే పంటను తగులబెట్టారు. దళారుల చేతిలో దగాపడిన రైతుల్ని ఆదుకోవాల్సిన అధికార, విపక్షాలు మిర్చి మంటలు రాజేశాయి. పరస్పర విమర్శలతో మద్దతు ధరను మండించేశాయి. మద్దతు ధర మాటేమోగానీ వీళ్ల చిల్లీ పాలిటిక్స్ చూసి రైతులు మరింత పరేషాన్ అవుతున్నారు.
ఎట్టకేలకు దిగివచ్చిన కేంద్రం మిర్చి క్వింటాల్ కొనుగోలు ధర 5000.. ఖర్చుల కింద అదనంగా 1250 కలిపి మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ప్రకారం రూ.6250 ఇస్తామని ప్రకటించింది. ఈ నెల 31 వరకూ రైతుల నుంచి కొనుగోళ్లు తెలిపింది. ఏపీలో 88,300 టన్నుల కొనుగోలు,తెలంగాణలో 33,700 టన్నులు కొంటామని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో దళారుల దగాకు చెక్ పడుతుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అంటున్నారు.
అయితే మిర్చి కొనుగోలుపై కేంద్రప్రభుత్వ ప్రకటన మిలీనియం జోక్ అని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మిర్చి కొనుగోలు, రైతుల సమస్యలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిర్చి రైతులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుతం విఫలమైందన్నారు. కేంద్రం కేవలం 33 వేల మెట్రిక్ టన్నుల మిర్చి కొనుగోలుకు అంగీకరించింది. రాష్ట్రంలో 7 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పండింది. కాగా 33 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అందులోనూ నాణ్యమైన మిర్చిని కొనుగోలు చేయాలనే నిబంధన పెట్టడం సరికాదన్నారు. నాణ్యత తక్కువ ఉన్న మిర్చి పరిస్థితి ఏంటన్నారు. మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు. మిర్చి క్వింటాల్‌కు రూ. 5 వేలు ఇవ్వడమంటే రైతులకు శఠగోపం పెట్టడమేనన్నారు. కేంద్రం మిర్చి క్వింటాల్‌కు రూ. 7 వేలు ఇవ్వాలన్నారు.
మొత్తానికి ఈ చిల్లీ పాలిటిక్స్ తోనైనా మిర్చి మద్దతు కల్పించాలని రైతులు కోరుతున్నారు. కనీస పెట్టుబడి వచ్చేలా గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.