Featured2 Sports

చెత్త రికార్డ్ ని తట్టుకోలేక…


ఐపీఎల్ 10 సీజన్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కు దిమ్మదిరిగిపోయే షాక్ తగిలింది. 49 పరుగులకే ఆలౌటై చెత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తిరుగులేని బ్యాట్స్ మెన్ సింగిల్ డిజిట్ కు పరిమితం కావడం కోహ్లీని కలవరపరుస్తోంది. పేలవమైన ప్రదర్శనతో తమ జట్టు విఫలమైందన్న కోహ్లీ.. ఇలాంటి తప్పు మళ్లీ ఎప్పుడు చేయబోమంటున్నాడు.

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి అద్భుత బ్యాట్స్‌మెన్స్ ఉన్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ నిన్న ఎదురైన ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది. 49 పరుగులకే కుప్పకూలడాన్ని అవమానంగా భావిస్తోంది. బ్యాట్స్‌మెన్స్ అందరూ సింగిల్ డిజిట్‌ స్కోర్‌కే పరిమితమయ్యారు. ఎంత దారుణమంటే ఈ మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు 9 పరుగులు. ఐపీఎల్‌లో చరిత్రలోనే ఇంత తక్కువ పరుగులకు ఆలౌట్ అయ్యి ఈ జట్టు ఓ చెత్త రికార్డ్‌ను నమోదు చేసింది. తాను ఇంత దారుణంగా డకౌట్ కావడం ఎంతో బాధ కలిగించిందని మ్యాచ్ అనంతరం కోహ్లీ చెప్పాడు.

తనతో పాటు, తమ జట్టు చెత్త ప్రదర్శన ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి అని అన్నాడు. ఇక్కడ నిల్చుని ఇలా మాట్లాడటానికి చాలా బాధగా ఉందని కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రొఫెషనల్ క్రికెటర్స్ నుంచి ఉత్తమ ప్రదర్శన ఆశిస్తారని, ఆ విషయంలో తమ జట్టు పూర్తిగా విఫలమైందని కోహ్లీ అంగీకరించాడు. తమ ఆటతీరు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్ ప్రదర్శన తమను ఎంతో అవమానానికి గురిచేసిందని కోహ్లీ చెప్పాడు. గత మ్యాచ్‌లో 2వందలకు పైగా స్కోర్ చేసిన తమ టీమ్ ఇలా ఆడటం సమంజసం కాదని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఇకపై ఇలాంటి తప్పు జరగదని, తాము ఏం తప్పు చేశామో తెలుసని కోహ్లీ చెప్పాడు. ఏప్రిల్ 25న సన్‌రైజర్స్ జట్టుతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడనుంది. ఏప్రిల్ 27న గుజరాత్ లయన్స్‌తో మరో మ్యాచ్ ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో సత్తా చాటి ఈ అవమానాన్ని తుడిచివేయాలని కోహ్లీ సేన భావిస్తోంది.