Politics

ట్రంప్ మరో సంచలనం


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అదే దూకుడు కొనసాగిస్తున్నారు. తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ జేమ్స్‌ కొమెని పదవి నుంచి తొలగించారు. ట్రంప్‌ నిర్ణయంపై డెమాక్రాట్లు మండిపడ్డారు. రష్యాతో ట్రంప్‌నకు ఉన్న సంబంధాలపై ఎఫ్‌బీఐ విచారిస్తున్న సమయంలో ఆ సంస్థను ప్రభావింతం చేసేందుకు తాజా చర్య తీసుకున్నట్లు ఆరోపిస్తున్నారు. అయితే.. క్లింటన్‌ ఈ-మెయిల్స్‌ దర్యాప్తు అంశానికి సంబంధించి గతవారం కాంగ్రెస్‌కు సరైన సమాచారం ఇవ్వని కారణంగానే ఆయన్ను తొలగించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌కు పదేళ్ల కాల వ్యవధి ఉన్నప్పటికీ నాలుగేళ్లుగా మాత్రమే పదవిలో ఉన్న కొమెను తొలగించటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ పదవి నుంచి తొలగిస్తున్న విషయాన్ని ట్రంప్‌ నేరుగా కొమెకు తెలియజేశారు. ఈమేరకు ఆయన ఓ లేఖను కొమెకు పంపించారు. దీనిలో ‘మీరు బ్యూరోను సమర్థంగా నిర్వహించలేకపోతున్నారనే అమెరికా అటార్నీ జనరల్‌ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. దీనిపై అటార్ని జనరల్‌ సీజన్స్‌ మాట్లాడుతూ ‘అత్యున్నత శ్రేణి క్రమశిక్షణ, నిబద్ధత, చట్టానికి కట్టుబడి ఉన్నాం. అందుకే ఒక కొత్త ప్రారంభం అవసరమైంది’ అని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై చేపట్టిన దర్యాప్తు ట్రంప్‌కు చుట్టుకుంటుందన్న భయంతోనే కొమెను తొలగించినట్లు సెనెట్‌ నాయకుడు చుక్‌ స్కీమర్‌ ఆరోపించారు. ఈ ఆరోపణలను ట్రంప్‌ ఇప్పటికే కొట్టివేశారు.