Sports

డ్రెస్ బాగోలేదని..పంపించేశారు!


డ్రెస్‌ బాగోలేదన్న కారణంతో మలేషియాలో ఓ 12ఏళ్ల చెస్‌ క్రీడాకారిణిని ఆట మధ్యలోంచి బయటకు పంపారు నిర్వహకులు. దీంతో ఆమె టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
మలేసియాలో ఏప్రిల్‌ 14 నుంచి 16వరకు నేషనల్‌ స్కాలాస్టిక్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ జరిగింది. ఈ పోటీల్లో ఓ 12ఏళ్ల క్రీడాకారిణి మోకాళ్ల వరకు ఉండే స్కర్ట్‌ వేసుకుని పాల్గొంది. దీంతో ఆమె డ్రెస్‌ కోడ్‌ నిబంధనలను వ్యతిరేకంగా ఉందని, అంతేగాక, యువకులను ఆకట్టుకునేలా ఉందని ఆరోపిస్తూ.. ఆమెను టోర్నీ మధ్యలో నుంచి బయటకు పంపించేశారు. ఈ ఘటనను బాలిక కోచ్‌ కౌశల్‌ కాందహార్‌ ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
‘టోర్నీలో పాల్గొన్న బాలిక తొలి రౌండ్‌ను పూర్తి చేసుకుంది. అప్పుడు ఆమె డ్రెస్‌పై ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అయితే రెండోరౌండ్‌ గేమ్‌ ఆడుతుండగా మధ్యలోనే ఆమెను బయటకు పంపించేశారు. వేరే డ్రెస్‌ కొనుక్కొని తర్వాతి రోజు టోర్నీకి రమ్మని చెప్పారు. అయితే అప్పటికే రాత్రి 10 గంటలు దాటింది. దుకాణాలన్నీ మూసేశారు. తర్వాత రోజు 9 గంటలకే టోర్నీకి రమ్మన్నారు. అప్పటికీ దుకాణాలను తెరవరు. దీంతో చేసేదేమీ లేక టోర్నీని వదులుకోవాల్సి వచ్చింది’ అని కోచ్‌ కౌశల్‌ చెప్పారు. ఈ ఘటనలో తన స్టూడెంట్‌ బాలా ఇబ్బందిపడిందన్నారు.