Social

నాడు చైల్డ్ చైన్ స్మోకర్..నేడు టాప్ ర్యాంకర్..ఎలా మానేశాడంటే..?

రెండేళ్లకే సిగరేట్ కాలుస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన చిన్నారి అల్ది రిజాల్. అప్పట్లో రోజుకు 40 సిగరెట్లు కాల్చే బుడ్డొడు…ఇప్పుడు అస్సలు తాగట్లేదు. స్మోక్ ను పూర్తిగా మానేసి కడుపు నిండా తింటూ చదవులపై దృష్టి పెట్టాడు. అంతేకాదు స్కూల్లో టాప్ ర్యాంకర్ గా నిలిచి శభాష్ అనిపించుకుంటున్నాడు. ఓ చేతిలో సైకిల్ హ్యాండిల్, మరో చేత్తో సిగరెట్ పట్టుకుని పొగ ఊదుతూ ఉండే బ్యాడ్ బాయ్ …ఇప్పుడు చక్కగా పుస్తకాలు పట్టుకుని గుడ్ బాయ్ లా మారాడు.

రోజుకు కనీసం 40 సిగరెట్లను తాగే తన అలవాటును 2013లో అల్ది వదిలి పెట్టాడు. అయితే సిగరెట్లు పూర్తిగా మానేసే ప్రక్రియ మాత్రం అంత సులభంగా జరగలేదు. సిగరెట్లను మానేసిన తర్వాత అల్ది ఆలోచన మొత్తం ఆహారం పై పడింది. దీంతో ఒక్క సారిగా బరువు పెరిగాడు. డాక్టర్ సలహాతో తల్లిదండ్రులు ఆహారాన్ని అందించడంతో అల్ది మామూలు స్థితికి చేరుకున్నాడు. ప్రస్తుతం తొమ్మిదేళ్ల వయసున్న అల్ది స్థానిక స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నాడు. అంతేనా చదువుల్లో దూసుకుపోతూ ఏకంగా టాప్ ర్యాంకర్గా పేరు తెచ్చుకున్నాడు. అల్ది చిన్నతనంలో సిగరెట్ ఇవ్వకపోతే ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడని, అస్సలు వినకపోయేవాడని అల్ది తల్లి డియానే రిజాల్ తెలిపారు. కానీ ఇప్పుడు సిగరెట్ తాగే ఆలోచనే అతనిలో లేదని చెప్పారు.