Movies

పంత్‌ కొట్టుడుకి..ప్లేఆఫ్‌ రేసు నుంచి గుజరాత్‌ ఔట్‌

ఓ వైపు పంత్‌.. మరోవైపు సంజు. రెచ్చిపోయిన ఈ జంట విధ్వంస బ్యాటింగ్‌తో గుజరాత్‌ బౌలర్లను వణికించింది. ఆకాశమే హద్దుగా విరుచుకుపడ్డ ఈ యువ ద్వయం మంచి సిక్సర్లు బాదేస్తుంటే ప్రేక్షకుల జోష్ తో స్టేడియం షేక్ అయింది. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని సైతం దిల్లీ అలవోకగా ఛేదించి ప్లేఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. పంత్ కొట్టుడు కొడితే ప్లేఆఫ్‌ రేసు నుంచి గుజరాత్‌ ఔట్‌ అయింది.

కుర్రాళ్ల మోతతో దిలీ డేర్‌డెవిల్స్‌ అద్భుత విజయం సాధించింది. రిషబ్‌ పంత్‌ (97; 43 బంతుల్లో 6×4, 9×6), సంజు శాంసన్‌ (61; 31 బంతుల్లో 7×6) కళ్లుచెదిరేలా బ్యాటింగ్‌ చేయడంతో గురువారం దిల్లీ 7 వికెట్ల తేడాతో గుజరాత్‌ లయన్స్‌ను మట్టికరిపించింది. సురేశ్‌ రైనా (77; 43 బంతుల్లో 5×4, 4×6), దినేశ్‌ కార్తీక్‌ (65; 34 బంతుల్లో 5×4, 5×6) మెరుపులతో మొదట గుజరాత్‌ 7 వికెట్లకు 208 పరుగులు సాధించింది. శాంసన్‌, పంత్‌ మెరవడంతో లక్ష్యాన్ని దిల్లీ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఎనిమిదో పరాజయం చవిచూసిన గుజరాత్‌ కథ ఈ టోర్నీలో ముగిసిపోయింది. ఇక మిగిలిన మ్యాచ్‌ల్లో ఆ జట్టు చేయగలిగింది మిగతా జట్ల ప్లేఆఫ్‌ అవకాశాలను ప్రభావితం చేయడమే.