Featured Sports

బెట్టింగ్.. బాలుడి ప్రాణం తీసింది.


ఐపీఎల్ లో బెట్టింగ్ జోరుగా సాగుతోంది. బాల్ బాల్ కు బెట్టింగ్ కోట్లలో జరుగుతోంది. కాయ్ రాజా కాయ్ అంటూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా యమరంజుగా సాగుతోంది. బెట్టింగుల్లో కొందరు డబ్బులు పొగొట్టుకుంటే మరికొందరు ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు.

పశ్చిమ్‌ బంగాలోని హౌరా జిల్లాకు చెందిన ఓ 12 ఏళ్ల బాలుడు ఆదివారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌పై తన స్నేహితుడి దగ్గర రూ.250 బెట్టింగ్‌ కట్టి గెలిచాడు. తీరా డబ్బులివ్వడానికి అతను ఒప్పుకోలేదు. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో బాలుడిని దగ్గర్లోని ఓ గార్డెన్‌ వద్దకు తీసుకెళ్లి ఇటుకతో తలపై కొట్టి చంపాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా బాలుడి మృతదేహాన్ని దగ్గర్లోని పొదల్లో పడేశాడు.
సోమవారం ఉదయం విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు మృతుడి స్నేహితులను విచారించారు. అందులో ఓ బాలుడు జరిగిందంతా చెప్పేశాడు. వెంటనే పోలీసులు నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. ఇప్పుడేం చేసినా తమ కుమారుడు తిరిగి రాడని అయినా అతని చావుకి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలుడి తల్లిదండ్రులు విలపిస్తున్నారు.