Featured Movies Politics

బ్లాక్ టికెట్లు కొని సినిమా చూసిన సీఎం


కర్నాటక సీఎం సిద్ధరామయ్య రూటే సెపరేట్. కాస్ట్లీ వాచ్ నుంచి బ్లాక్ టికెట్లు కొనేదాకా సంథింగ్ స్పెషల్. బాహుబాలి కోసం రూల్స్ ని బ్రేక్ చేశారు. బ్లాక్ టికెట్లు కొని మరి జక్కన్న తీసిన బాహుబాలి2 సినిమాను చూశారు.  టికెట్ ధ‌ర రూ.200 మించొద్దు అని సాక్షాత్తూ అసెంబ్లీ సాక్షిగా ఆయ‌న పెట్టిన నిబంధ‌న‌ను ఆయ‌నే కాల‌రాశారు. 
తాను, త‌న కుమారుడు, మ‌న‌వ‌లు ఇలా ఓ 40 మంది ప‌రివారంతో ఈ సినిమా చూశారు క‌ర్ణాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య‌. ఒక్కో టికెట్‌కు ఆయ‌న చెల్లించిన మొత్తం  అక్ష‌రాలా రూ.1050.  బెంగ‌ళూరులోని ఓరియ‌న్ మాల్‌లోని గోల్డెన్ క్లాస్‌లో సాధార‌ణ ప‌బ్లిక్‌తో క‌లిసి ఆయ‌న సినిమా చూశారు. 

త‌న మ‌న‌వ‌లు క‌చ్చితంగా సినిమా చూడాల‌ని ఒత్తిడి చేయ‌డంతో సిద్ధ‌రామ‌య్య త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో వెళ్లార‌ని సీఎంవో వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అయితే ఈ ఏడాది బ‌డ్జెట్‌లో టికెట్ ధ‌ర రూ.200 మించ‌కూడ‌దన్న నిబంధ‌న‌ను తీసుకొచ్చినా దానిని ఇంకా అమ‌ల్లోకి తీసుకురాలేదు. అంత‌లోపే స్వ‌యంగా ముఖ్య‌మంత్రే ఇలా ఐదు రెట్లు ఎక్కువ ధ‌ర చెల్లించి సినిమా చూడ‌టం ఏంట‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే టికెట్ ధ‌ర‌కు ప‌రిమితి విధించాల‌ని ఒత్తిడి తీసుకొచ్చిన క‌ర్ణాట‌క ఫిల్మ్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్, క‌ర్ణాట‌క చ‌ల‌న‌చిత్ర అకాడ‌మీ మాత్రం దీనిపై స్పందించ‌డానికి నిరాక‌రించాయి. 

అంతేకాదు టికెట్ ధ‌ర ప‌రిమితి ఫైలుపై సంత‌కం చేయ‌డం విష‌యంలోనూ సిద్ద‌రామ‌య్యే కావాల‌నే నిర్ల‌క్ష్యం చేశార‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. నిజానికి గ‌త గురువార‌మే ఆయ‌న ఈ ఫైలుపై సంత‌కం చేయాల్సి ఉన్నా.. ఆయ‌న దుబాయ్‌కు వెళ్లారు. ఈలోపు బాహుబ‌లి సినిమా విడుద‌ల కావ‌డం.. థియేట‌ర్ల ఓన‌ర్లు త‌మ ఇష్టానుసారం రేట్లు పెంచేయ‌డం జ‌రిగిపోయింది.