Featured Trends

మరో ఏడాది జియో ఫ్రీ..!

 

అంబానీలు అడుగుపెట్టారంటే ఆ రంగంలో ఉన్న ప్రత్యర్థులు మటాష్ కావాల్సిందే. ఊహించని రీతిలో బిజినెస్ ట్రిక్స్ ప్లే చేస్తూ క్రమక్రమంగా మార్కెట్ ని తమ ఆధీనంలోకి తీసుకుంటారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎంత రిస్కైనా చేసి ముందుకువెళ్తుంటారు. తొలి రెండు,మూడేళ్లు నష్టాల్ని భరిస్తూనే ఆ రంగంలో పోటీదార్లను కోలుకోలేని దెబ్బకొడుతారు. ఇప్పుడు జియోతో టెలికాం సెక్టర్ లో అదే జరుగుతోంది.
రిలయన్స్ జియో ప్రత్యర్థి కంపెనీలను పోటీలోనే లేకుండా చేయాలని మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. రిలయన్స్ జియో ఫ్రీ స్కీమ్స్, డిస్కౌంట్ ఆఫర్లు మరో 12 నుంచి 18 నెలల వరకూ ప్రకటిస్తూనే ఉంటారని తెలుస్తోంది. ఆ తర్వాతే వినియోగదారుల నుంచి పూర్తి స్థాయిలో చార్జీలు వసూలు చేయాలని జియో నిర్ణయించినట్లు టాక్.

జియో ఈ నిర్ణయం తీసుకోవాలని భావించడానికి కారణం ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, బీఎస్ఎన్‌ఎల్ కంపెనీలేనట. ఈ కంపెనీలు జియో దెబ్బకు అన్‌లిమిటెడ్ బాట పట్టాయి. భారమని తెలిసి కూడా వేరే దారిలేక ఈ నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈ అన్‌లిమిటెడ్ ఆఫర్లను నిరంతరం కొనసాగించడం కాని పని. ఈ విషయాన్నే జియో గుర్తించింది. దీంతో ఇప్పటికిప్పుడు వినియోగదారుల నుంచి ఎక్కువ మొత్తంలో చార్జీలు వసూలు చేస్తే మొదటికే మోసం వస్తుందని భావించిన జియో ఈ డిస్కౌంట్స్‌ను, అన్‌లిమిటెడ్ లాభాలను మరో సంవత్సరం నుంచి సంవత్సరంన్నర వరకూ ప్రకటిస్తూనే ఉండాలని యోచిస్తోంది.

మరో సంవత్సరం పాటు అన్‌లిమిటెడ్ ప్లాన్స్‌ను భరించడం ప్రత్యర్థి కంపెనీలకు అలవికాని పనిగా జియో భావిస్తోంది. పైగా అన్‌లిమిటెడ్ ప్లాన్స్ ప్రకటించడంతో ఇతర కంపెనీలు నెలకు ఒక్కో ప్రీపెయిడ్ వినియోగదారుడి నుంచి 3వందల రూపాయలు మాత్రమే ఆదాయాన్ని పొందుతున్నట్లు యూఎస్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్నీ నివేదికలో వివరించింది. జియో ఆఫర్ల వల్ల ఒక్కో వినియోగదారుడి నుంచి నెలకు వసూలు చేస్తున్న సగటు ఆదాయం భారీగా పడిపోయిందని, ఇదే పరిస్థితి దీర్ఘకాలికంగా కొనసాగితే ఇతర టెలికాం కంపెనీల మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని మోర్గాన్ స్నాన్లీ వివరించింది.