Latest News

మాడు పగిలే ఎండలు…

 


ఎండలు దంచికొడుతున్నాయి. ప్రచండభానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మిట్టమధ్యాహ్నామయ్యేసరికి మాడు పగిలేలా ఎండలు మండిపోతున్నాయి. పై నుంచి సూర్యకిరణాలు.. కింద భూమి నుంచి సెగల కక్కుతున్న వేడి.. జనాన్ని అల్లాడిస్తున్నాయి. రోజురోజుకు టెంపరేచర్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి.

పలుచోట్ల 44 డిగ్రీల ఉష్ణోగ్రతను దాటి నమోదవుతున్నాయి. తెలంగాణ, దక్షిణ కోస్తా, రాయలసీమలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొత్తగూడెం, మంచిర్యాలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గుంటూరు, రెంటచింతల, కరీంనగర్‌, నల్గొండ, ఖమ్మంలో 43 డిగ్రీలు, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌లో 42 డిగ్రీలు, విజయవాడ, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, కడపలో 42 డిగ్రీలు, కర్నూలు 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ప్రజలు అత్యవసరమైత తప్ప బయటకి వెళ్లొద్దని వైద్యులు చెప్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కంపల్సరీగా గొడుగులు, టోపీలు, కూలింగ్ గ్లాసెస్ ధరించాలంటున్నారు. వేడిగాలి తగులకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.

భగభగల నుంచి ఉపశమనం పొందేందుకు జనం శీతలపానీయాల కేంద్రాల్ని ఆశ్రయిస్తున్నారు. కూల్ కూల్ గా జ్యూస్ లు తాగుతూ కనిపిస్తున్నారు.