Politics

మావోలకు “సిల్వర్ బుల్లెట్లు”చాలవు

 

 

 

 

 

 

 

 

నక్సలైట్లను ఎదుర్కునేందుకు పూర్తి సైనిక సహకారంతో పాటు, సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. నక్సలైట్లపై దేశం విజయం సాధించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. మావోయిస్టు ప్రాబల్యం అధికంగా ఉన్న పదిరాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన సోమవారం ప్రత్యేకంగా సమీక్ష జరిపారు.ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్‌తో పాటు 35 మావోయిస్టు ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పారామిలటరీ దళాల అధిపతులు, ఇంటిలిజెన్స్ అధికారులు పాల్గొన్నారు. ‘‘నక్సలైట్ సమస్యను ‘‘సిల్వర్ బుల్లెట్లు’’ లేదా మరేదైనా స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక పద్ధతుల్లో పరిష్కరించడం కుదరదు.. ఆర్ధికంగా దెబ్బతీయడమే వామపక్ష అతివాదంపై పోరాడేందుకు ప్రాథమిక సూత్రం’’ అని రాజ్ నాథ్ అన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడం, తుపాకీ గురిపెట్టి ప్రజాస్వామ్యం పీకనొక్కాలని ప్రయత్నించడం వంటివి ఎప్పటికీ విజయం సాధించలేవన్నారు.

గత 20 ఏళ్లలో మావోయిస్టు హింస కారణంగా 12 వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని రాజ్ నాథ్ విచారం వ్యక్తం చేశారు. వామపక్ష అతివాదం (ఎల్‌డబ్ల్యూఈ)కి చెక్ పెట్టేందుకు షాడో ఇంటిలిజెన్స్ అధిరులను నియమించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రప్రభుత్వాలు కేంద్ర బలగాలతో సమన్వయం చేసుకోవాలని.. భద్రతా దళాల నివాసాలకు సౌకర్యవంతమైన సదుపాయాలుండాలన్నారు.