Featured

మెట్రో రైలు రాకతో ట్రాఫిక్ కష్టాలకు చెక్..!

 

 

 

 

 

 

 

 

 

హైదరాబాద్ లో మెట్రో రైలు ఎప్పుడు పట్టాలెక్కుతుంది. ట్రాఫిక్ కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని అందరూ ఎదురుచూస్తున్నారు. ట్రయల్ రన్ నిర్వహిస్తున్న రూట్లలోనైనా జూన్ 2న మెట్రో ప్రారంభమవుతుందని ఆశిస్తున్నారు. మెట్రో రైలు వస్తుంది కానీ..ఎప్పుడు వస్తుందో చెప్పలేమంటున్న మెట్రో రైలు ఎండీ.. వస్తే ట్రాఫిక్ కష్టాలు మాత్రం పక్కా తీరుతాయంటున్నారు.
మెట్రో రైలు రాకతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ప్రజా రవాణా వ్యవస్థ సరిగా లేకపోతే సమస్యలు వస్తాయన్నారు. ఇంటర్‌మోడల్ కనెక్టివిటీని త్వరలో ప్రారంభించబోతున్నామని తెలిపారు. ప్రయాణికులు రోడ్డు దాటడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. బస్ బేస్, ఆటో బేస్, వాహనాల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రయాణికుల కోసం అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.

మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ సమస్య లేదన్నారు. 17 చోట్ల ఎల్ అండ్ టీ మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. హైదరాబాద్ మెట్రో ఆధ్వర్యంలో 15 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేస్తామన్నారు. మెట్రో స్టేషన్ల నుంచి ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణికులను తరలిస్తామని చెప్పారు. ప్రయాణికులను 4, 5 కిలోమీటర్ల వరకు తరలించే సదుపాయం కల్పిస్తామన్నారు. 2018 నాటికి పాతబస్తీలోని 6 కి.మీ. తప్ప మిగతా మెట్రో లైన్ పూర్తి చేస్తామని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.