Featured Latest News Politics

యుద్ధానికి సిద్ధం

అణుదాడికి మేము సిద్ధమని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. భారీ ఆయుధ సంపత్తి ప్రదర్శించింది. ఎలాంటి అణుదాడికైనా సమాధానం చెప్పేందుకు ఉత్తర కొరియా సిద్ధంగా ఉందని ఆ దేశ ఉన్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. అమెరికా ఏ తరహా దాడులు చేసిన తాము సమాధానం చెప్తామన్నారు. అవసరమైతే తమ స్టైల్‌లో అణుదాడులు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని మిలిటరీ అధికారి చోయ్‌ ర్యోంగ్‌హాయి చెప్పారు. నేడు ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్‌ 2-సంగ్‌ 105వ జయంత్యుత్సవాల సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్యొంగ్‌యాంగ్‌లో జరిగిన వేడుకల్లో ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌ జొంగ్‌ ఉన్‌ పాల్గొన్నారు. మిలిటరీ పరేడ్‌లో తమ సైనిక బలగాన్ని ప్రదర్శించగా.. కిమ్‌ సైన్యాధికారులకు అభివాదం చేశారు.
దేశ సైనికులు, యుద్ధట్యాంకులు, ఇతర ఆయుధ సంపత్తితో భారీ పరేడ్‌ నిర్వహించారు. ఈరోజు కిమ్‌ 2-సంగ్‌ జయంతి సందర్భంగా కిమ్‌ జోంగ్‌ మరో అణు పరీక్షకు ఆదేశించే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఉ.కొరియా భారీ ఆయుధ సంపత్తిని ప్రదర్శించడం గమనార్హం. ఈ పరేడ్‌లో తొలిసారిగా సబ్‌మెరైన్‌ నుంచి ప్రయోగించే బాలిస్టిక్‌ క్షిపణులు ప్రదర్శించినట్లు సమాచారం.