Featured

రైతులకే ఎందుకిలా..?


కాలం మారుతోంది. దేశం అభివృద్ధి వైపు రాకెట్ లా దూసుకెళ్తోంది. ప్రపంచ దేశాల్ని చుట్టేస్తున్న ప్రధాని మోదీ డిజిల్ ఇండియా, మేకిన్ ఇండియా ,ఫ్రెండ్లీ ఇండియా అని తెగ పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు.టాటా, బిర్లా, అంబానీల ఆదాయం మూడింతలై..ఇండియాని కొనేంతా రేంజ్ కు చేరింది. 10 రూపాయల ఎమ్మార్పీ రేట్ ఉన్న వస్తువు మూడు నాలుగేళ్లలో రెట్టింపు అవుతోంది. బట్ రైతులకే ఎందుకు ఈ పరిస్థితి..బిడ్డలా పెంచిన పంటకు ధర లేక ఎందుకు తగులబెడుతున్నారు. జై కిసాన్ అనే గొప్ప గొప్ప లెక్చర్లు ఇచ్చే ప్రజాప్రతినిధులు.. పంటలకు మద్దతు ధరలపై ఎందుకు మాట్లాడం లేదు. పంటచేతికి వచ్చిన సమయంలోనే ధరలెందుకు పడిపోతున్నాయి. కొనే వారెందుకు కరువుతున్నారు. ఇలాంటి పరిస్థితులు సృష్టిస్తున్నదెవరు..దళారుల దందా జోరుగా సాగుతున్నా…దగా పడుతున్న రైతన్న ఎందుకి పట్టించుకోవట్లేదు. ఈ సర్కార్ ఆసర్కార్..ఈ నేత ఆ నేత ..ఏ నేతైనా ఎందుకు పట్టించుకోవడం లేదు. ఓట్ల టైమ్ వచ్చే సరికి తెగ హామీలు కురిపించే నేతలు ఇప్పుడు ఏమైపోయారు..?

ఈ కాలంలో ఆరు తడి పంటలే వేయాలని సూచించిన వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులు.. పంటలు చేతికొచ్చే సమయానికి ఏ కలుగులో దాక్కున్నారు. మద్దతు ధరలు లేక విలవిలలాడుతున్న అన్నదాత అరణ్యవేదన వినిపించడం లేదా..మార్కెటింగ్ శాఖాధికారులు మార్కెట్లలో పరిస్థితిని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు. రైతుల్ని ఆదుకుంటామని భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. సర్కారే.. పంట కొంటుందన్న కోతలు ఏమైపోయాయి. తీరా సర్కార్ ఏర్పాటు సెంటర్లలో అమ్మినా… అకౌంట్ డబ్బులు పడేదెప్పుడో తెలియక అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. రోజులతరబడి కళ్లు కాయల కాచేలా ఎదురుచూస్తున్నారు. అప్పులొళ్లకు సమాధానం చెప్పలేక ఆందోళన చెందుతున్నారు.

నెలలపాటు కష్టపడి.. బిడ్డలా పెంచి పండించిన పంట.. వేలాది రూపాయలు వెచ్చించి సాధించిన దిగుబడి.. మార్కెట్‌లో ఆ పంటకు గిట్టుబాటు ధర లేకపోతే.. రైతు కడుపు మండకుండా ఉంటుందా? అలా కడుపు మండిన రైతు కల్లంలోని మొత్తం మిర్చి పంటను తగులబెట్టాడు. ఏమాత్రం గిట్టుబాటు ధర పలికినా చేసిన కష్టం దక్కేది. కానీ ఇప్పటికే పంట పండించేందుకు చేసిన అప్పుకు తోడు మార్కెట్ ఖర్చూ భరించాల్సి రావడంతో పంటను పొలంలోనే కుప్ప పోసి నిప్పు పెట్టాడు. మంచిర్యాల జిల్లా వేమలిపల్లి మండలం నడిమిగడ్డకు చెందిన రైతు చటారి రామన్న తన ఆవేదనను ఇలా తీర్చుకున్నాడు.

ఇది రైతు రామన్న ఒక్కడి పరిస్థితే కాదు..మిర్చి పండించిన అన్నదాతల అందరిదీ అక్షరాల ఇదే పరిస్థితి. కన్నీళ్లు ఆపుకుంటూ బాధని చెప్పులేక ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోలేక, చేసిన అప్పులు తీర్చలేక కుమిలిపోతున్నారు. మిర్చియే కాదు అన్ని ధాన్యాల ధరలు ఇలాగే ఉన్నాయి. కొనేవారు లేక ఇంట్లో స్లోర్ చేసే వీల్లేక పొలంలో కాపలా ఉండలేక ..బిడల్లాంటి పంటల్ని కాల్చేస్తున్నారు.
పంటలు పండించేందుకు అవసరమయ్యే ఎరువులు, మందుల ధరలు మూడేళ్లలో రెట్టింపు అయ్యాయి. కానీ రైతుల దిగుబడులకు మద్దతు ధరల దిక్కులేకుండా పోయింది. ఢిల్లీ నడిరోడ్డులో బట్టలన్నీ విప్పేసి నిరసన తెలిపిన సర్కార్ పెద్దలకు కనిపించట్లేదు. వ్యవసాయ సంక్షేమం కోసం బడ్జెట్ లో కోట్లు కోట్లు కేటాయించినా రైతుల పరిస్థితి బాగుపడట్లేదు. ఎందుకిలా..
ఎన్ని ప్రభుత్వాలు మారినా…ఎంత మంది మంచి నేతలొచ్చినా అన్నదాతల పరిస్థితి మాత్రం ఇంచుకూడా మారడం లేదు. అప్పుడో ఇప్పుడో కిసాన్ ల బాధ చూసి వరుణుడైనా వర్షిస్తాడమోగానీ..కరుణించే నేతలు కాళ్లపైకాళ్లేసుకుని కూర్చుకుంటున్నారు. రైతన్న వీళ్లని నమ్ముకుంటే ఎప్పుడైనా నీ పరిస్థితి ఇలాగే ఉంటుంది. కడుపు మండి పండిన పంటను కాల్చేయకు…మార్కెంటింగ్ శాఖ మంత్రో,,ముఖ్యమంత్రి ,,ప్రధానమంత్రో ఇంటిముందు పడేయ్.గిట్టుబాటు ధర ఇచ్చేదాకా లడాయి చేయ్…సర్కార్ పెద్దోళ్లు దిగే వచ్చేదాకా ధర్నాలు చేయు..అన్ని ధర్నాలు, ఆందోళనలు, ఉద్యమాల్లో నీ పాత్ర కాదనలేనిది..అదే స్ఫూర్తితో ఇప్పుడు అడుగు ముందుకేయ్…ఇన్నాళ్లు వేలెత్తిచూపి నాయకుడు నడిపిన బాటలో నడిచిన నువ్వు…పోరాట తొవ్వలో నడువు..తోటి రైతుల్ని కలుపుకుపో…పంటలకి గిట్టుబాటు ధరలు కల్పించుకో..నువ్వు వేసే ఒక్క అడుగు కోట్ల మందిని కదిలించాలి. నీ అడుగులో అడుగులై కోట్లమంది అన్నదాతలు సాగాలి.
ఎప్పుడు ఆన్ లైన్ లో ఉండే మీ బిడ్డలు సోషల్ మీడియా వేదికగా మీకు మద్దతుగా నిలుస్తారు. సర్కార్ దిగిచ్చేలా ఉద్యమిస్తే కాని గిట్టుబాటు ధరలు రావు…లేదంటే ఇంకో యాభైయేళ్లనా పంట తగులబెట్టాల్సిందే.!