Featured Latest News Politics

రోడ్లపై ఒక్క గుంత కనిపించినా..సస్పెండ్ చేస్తా:కేసీఆర్

రాష్ట్రంలోని ఏ రహదారిపై కూడా ఒక్క గుంత కూడా కనిపించవద్దని, మే నెలాఖరులోగా అన్ని గుంతలు పూడ్చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. జూన్ 1 తర్వాత తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని, ఎక్కడ గుంత కనిపించినా సరే సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ప్రగతి భవన్ లో రోడ్లు భవనాల శాఖ పరిధిలోని పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష స‌మావేశం నిర్వహించారు. ఆర్ అండ్ బి శాఖకు కొత్త రహదారుల నిర్మాణానికి, రహదారుల మరమ్మత్తులకు అవసరమైన నిధులు బడ్జెట్లోనే కేటాయించామని, అయినా ఇంకా గుంతల రోడ్లు కనిపించడం బాధాకరమని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై అధికారుల అలసత్వాన్ని ఏమాత్రం క్షమించేది లేదన్నారు..

‘‘చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేశాం. కేంద్రాన్ని ఒప్పించి అనేక జాతీయ రహదారులను కూడా సాధించాం. కొత్త రహదారుల నిర్మాణంతో పాటు రహదారుల మరమ్మత్తులకు కూడా నిధులిచ్చాం. అయినా సరే ఇంకా రహదారులపై గుంతలు కనిపిస్తున్నాయి. అవి ప్రమాదానికి కారణమవుతున్నాయి. నేను మొన్న వరంగల్ జిల్లాలో పర్యటించినప్పుడు వరంగల్ నుంచి పాలకుర్తి వరకు రోడ్డు మార్గంలో ప్రయాణించాను. నాకే అనేక గుంతలు కనిపించాయి. గుంతలు ఉండవద్దని ఎప్పటికప్పుడు వాటిని పూడ్చేయాలని గతంలోనే నేను చెప్పాను. అయినా అధికారులు సీరియస్ గా తీసుకోలేదు. ఇది మంచి పద్దతి కాదు. మీకు సరిగ్గా నెలరోజుల టైమ్ ఇస్తున్నాను. మే చివరి నాటికి అన్ని గుంతలు పూడ్చేయాలి. తర్వాత ఎక్కడైనా గుంతలు కనిపిస్తే అక్కడికక్కడే అక్కడి అధికారిని సస్పెండ్ చేస్తాం’’ అని సిఎం హెచ్చరించారు.

‘‘రహదారుల అభివృద్ధిలో భాగంగా పంచాయితీ రాజ్ రోడ్డును ఆర్ అండ్ బి పరిధికి, ఆర్ అండ్ బి రహదారిని జాతీయ రహదారుల పరిధిలోకి తెస్తున్నారు. శాఖ మారిన సందర్భంలో కొత్త రోడ్డు నిర్మించడానికి కొంత సమయం పడుతుంది. ఆలోగా రోడ్డుకు గుంతలు పడినా, కొట్టుకుపోయినా దాన్ని అలాగే వదిలేస్తున్నారు. మరమ్మత్తులు చేయడం లేదు. రహదారి అభివృద్ధి పనులు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్టర్ పని చేయకుంటే కూడా రహదారి అలాగే ఉండిపోతుంది. ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ దుస్థితిపోవాలి. మరమ్మత్తులు నిరంతరం జరుగుతూనే ఉండాలి’’ అని సీఎం స్పష్టం చేశారు.

‘‘కొత్తగా జిల్లా కార్యాలయాల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించాం. డిజైన్లు కూడా ఆమోదించాం. వెంటనే టెండర్లు పిలవాలి. పది పదిహేను రోజుల్లోనే నిర్మాణ పనులు ప్రారంభించి, ఏడాదిలోగా పూర్తి చేయాలి. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కార్యాలయాల నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తి చేయాలి. ప్రజలకు పాలన అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యతో జిల్లాలను ఏర్పాటు చేశాం. కార్యాలయాల నిర్మాణం జరిగితేనే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి జాప్యం జరగవద్దు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

‘‘పనిభారం పెరిగిన శాఖల్లో ఉన్నతోద్యోగుల అవసరం కూడా పెరుగుతున్నది. ఆర్ అండ్ బి, నీటి పారుదల శాఖ తదితర విభాగాల్లో ఈఎన్‌సీలు, ఇతర ఉన్నతాధికారుల సంఖ్యను పెంచుకోవాలి. ఆర్ అండ్ బీ పరిధిలో చాలా పనులు జరుగుతున్నాయి. కాబట్టి అవసరమైన సీనియర్ ఆఫీసర్ పోస్టులు పెంచుకోవాలి. కొత్త రాష్ట్రం కాబట్టి అధికారుల అనుభవాన్ని ఉపయోగించుకోవాలనే సదుద్దేశ్యంతో రిటైరయ్యే ఉద్యోగుల పదవీ కాలాన్ని పొడిగిస్తున్నాం. అలాంటి సందర్భంలో పదోన్నతి పొందాల్సిన వారికి అన్యాయం జరుగుతుంది. అలా కాకుండా పోలీస్ శాఖ మాదిరిగా అదనపు పోస్టులు సృష్టించాలి. పదోన్నతులు క్రమం తప్పకుండా అందాలి. కొత్తగ సృష్టించిన పోస్టుల్లో పదోన్నతి ద్వారా వచ్చిన వారిని నియమించాలి. అప్పుడు ఎవరికీ అన్యాయం జరగదు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.