Featured Politics

కింగ్‌ఫిషర్‌ అధినేత విజయ్‌మాల్యాను లండన్‌లో అరెస్ట్‌ చేశారు. బ్యాంకులకు రూ.9వేల కోట్లు ఎగవేసిన కేసులో మాల్యా నిందితుడిగా ఉన్నారు. భారత్‌ నుంచి పారిపోయిన ఆయన ప్రస్తుతం ఇంగ్లండ్‌ రాజధాని లండన్‌కు సమీపంలో గల ఓ గ్రామంలో తలదాచుకుంటున్నారు. మాల్యాను అదుపులోకి తీసుకున్న యూకే పోలీసులు త్వరలోనే భారత్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా పలు బ్యాంకులకు రూ.9 వేల కోట్ల రుణాలు ఎగవేసిన విజయ్‌మాల్యా 2016 మార్చి 2న లండన్‌ పారిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ ఆయన్ను భారత్‌కు తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. మాల్యా వీసాను కూడా కేంద్రం రద్దు చేసింది. మాల్యాను బలవంతంగా ఆ దేశం నుంచి పంపించేయాలని భారత విదేశాంగ శాఖ.. యూకే ప్రభుత్వాన్ని కోరింది. అయితే అది సాధ్యం కాదని అప్పట్లో యూకే చెప్పింది.
ఈ నేపథ్యంలో మాల్యాను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రంగం సిద్ధం చేసింది. విచారణకు రావాలని అనేక నోటీసులు జారీ చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాను భారత్‌కు రాలేనని మాల్యా అప్పట్లో ట్విటర్‌ ద్వారా స్పందించారు. అయితే రుణాల విషయంలో బ్యాంకులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మరోవైపు మాల్యాకు వ్యతిరేకంగా బ్యాంకుల కన్సార్టియం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మాల్యా తన పూర్తి ఆస్తుల వివరాలను వెల్లడించాలని పిటిషన్‌ వేసింది. అయితే దీనిపై కూడా మాల్యా స్పందించకపోవడంతో ఇటీవలే దిల్లీ హైకోర్టు ఆయనపై ఓపెన్‌ ఎండెడ్‌ నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం మాల్యాను లండన్‌ పోలీసులు అరెస్టు చేశారు.