Featured Latest News

లక్కంటే ఈ ఆటోవాలాదే

 

 

 

 

 

 

 

 

అతనో ఆటోవాలా.. అదృష్టం ట్విట్టర్ వేగంతో తలుపు తట్టింది. దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఆనంద్‌ మహీంద్ర చేతుల మీదుగా వ్యాను బహుమతిగా అందుకునేలా చేసింది.

కేరళకి చెందిన సునీల్‌ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అందరిలా ఆటోను సాధారణ వాహనంలా కాకుండా అచ్చం స్కార్పియో కారులా మార్చేశాడు. ఎలాగంటే వెనక నుంచి చూస్తే నిజంగానే స్కార్పియో వెళుతున్నట్టే ఉంటుంది. ఈ కారులాంటి ఆటోను ఎవరో ఫొటో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. అది చూసిన వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘ఈ ఫొటో షేర్‌ చేసిన వారికి ధన్యవాదాలు. ఎవరైనా ఇతని ఆచూకీ కనుక్కుని చెప్తారా? నేను అతని నుంచి ఆ ఆటో కొనుక్కుని దాని బదులు ఫోర్‌ వీలర్‌ వాహనం ఇస్తాను’ అని ట్వీట్‌ చేశారు.
మొత్తానికి సునీల్‌ ఆచూకీ దొరకడంతో మహీంద్ర తానిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సునీల్‌ని కలుసుకుని అతని దగ్గర ఉన్న ఆటో తీసుకుని వేరే వ్యాన్‌ను బహూకరించారు. ఈ విషయాన్ని మహీంద్ర ట్విటర్‌ ద్వారా తెలుపుతూ.. ‘ఇతనే సునీల్‌, ఒకప్పటి మూడు చక్రాల సార్పియో యజమాని, ఇప్పుడు నాలుగు చక్రాల వ్యాన్‌కు యజమాని. థ్యాంక్యూ ట్విటర్‌’ అంటూ ట్వీట్‌ చేశారు.