Sports

లలిత్‌ లీక్స్…ధోనీ ఇమేజ్ డ్యామేజ్…

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మాజీ ఛైర్మన్‌, కళంకిత లలిత్‌మోదీ టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీపై ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్‌.శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్‌లో ధోనీ ఉద్యోగి అని చెబుతూ.. అందుకు సంబంధించిన ఆఫర్ లెటర్ ని పోస్ట్‌ చేశారు. ధోనీ ఏడాదికి రూ.100 కోట్ల వరకు సంపాదిస్తున్నప్పుడు ఈ ఉద్యోగం వెనకున్న ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.

‘బీసీసీఐ మాజీ పెద్దల ఉల్లంఘనలు ఒకదాని తర్వాత ఒకటి భారత్‌లోనే దర్శనమిస్తాయి. ఈ ఒప్పందం వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటి? అతడు ఏడాదికి రూ.100 కోట్లు సంపాదిస్తున్నప్పుడు శ్రీనివాసన్‌ దగ్గర ఉద్యోగానికి ఎందుకు ఒప్పుకోవాలి? ఇలాంటి ఒప్పందాలు ఇంకెన్నో ఉంటాయని నేను పందెం కట్టగలను’ అని లలిత్ మోదీ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్‌ చేసిన నియామక పత్రం ప్రకారం 2012లో ధోనీ (మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌) నెల మూల వేతనం రూ.43,000. కరవు భత్యం రూ.21,970. అన్నీ కలుపుకొని అతడి జీతం నెలకు రూ.60,000. ప్రత్యేక చెల్లింపులు మరో రూ.20,000. విద్యుత్‌, నీరు, గ్యాస్‌ ఛార్జీలకు రీయంబర్స్‌మెంట్‌ ఉంది.

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌, టీమిండియా మాజీ సారథి ధోనీ మధ్యగల సన్నిహిత సంబంధాలపై గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి. విదేశాల్లో భారత్‌ వరుసగా 8 టెస్టులు ఓడిపోయినప్పుడు ధోనీని సారథ్యం నుంచి తొలగించేందుకు శ్రీనివాసన్‌ అడ్డుకున్నాడని మాజీ సెలెక్టర్‌ మొహిందర్‌ అమర్‌నాథ్‌ ఆరోపణల సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్‌లో రైజింగ్‌పుణె సూపర్‌జెయింట్‌ ధోనీని కెప్టెన్సీ నుంచి తొలగించింది. ఈ సందర్భంలో శ్రీనివాసన్‌ కొన్ని రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ ధోనీ తిరిగి చెన్నై సూపర్‌కింగ్స్‌కు సారథ్యం వహిస్తాడని వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం లలిత్‌ మోదీ సోషల్‌మీడియాలో పెట్టిన నియామక పత్రం ఎన్ని సంచలనాలకు దారితీస్తుందో! అని, అతడు ఇంకెన్ని రహస్యాలు వెల్లడిస్తాడో! చూడాలి.