Featured Latest News

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

విమానాన్ని హైజాక్‌ చేస్తానంటూ ముంబయి పోలీసులకు ఈ-మెయిల్‌ చేసిన హైదరాబాద్‌ యువకుడిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. విమానాలను హైజాక్‌ చేస్తానంటూ ఈ నెల 16న ముంబయి పోలీసులకు ఈ-మెయిల్‌ బెదిరింపు వచ్చింది. దీంతో ముంబయి, చెన్నై, హైదరాబాద్‌(శంషాబాద్‌) అంతర్జాతీయ విమానాశ్రయాల దగ్గర హై అలర్ట్ ప్రకటించారు. ఓ మహిళ ఆరుగురు బాలురుతో కలిసి విమానాన్ని హైజాక్‌ చేసే అవకాశం ఉందంటూ ఈ-మెయిల్‌లో పేర్కొనడంతో ముంబయి పోలీసులు సంబంధిత అన్ని వ్యవస్థలనూ అప్రమత్తం చేశారు. విమానాశ్రయాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.
అయితే విచారణలో ఈ-మెయిల్‌ హైదరాబాద్‌ నుంచి వచ్చిందని గుర్తించిన అధికారులు హైదరాబాద్‌ పోలీసుల సాయం కోరారు. సిటీ పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి ఆదేశంతో టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ లింబారెడ్డి నేతృత్వంలో ఓ బృందం దీనిపై లోతుగా విచారణ చేపట్టింది. చివరికి అమీర్‌పేటకు చెందిన ట్రావెల్‌ ఏజెంట్‌ వంశీ ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. గురువారం అతడిని ఎస్సార్‌నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై ఐటీ చట్టంలోని రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
దీనిపై టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ లింబారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘వంశీ ప్రియురాలు చెన్నైలో ఉంటోంది. కొద్దిరోజుల క్రితం ముంబయి, గోవా ప్రాంతాలకు విహారానికి వెళ్దామని వంశీకి చెప్పింది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతడు కుదరదని చెప్పినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. విహారానికి వెళ్లాల్సిందేనని పట్టుబట్టడంతో అతడు ఓ పథకం వేశాడు. విమానాలు హైజాక్‌ బెదిరింపులు చేస్తే ప్రయాణం రద్దవుతుందన్న ఆలోచనలో ముంబయి పోలీసులకు ఈ-మెయిల్‌ బెదిరింపులకు పాల్పడ్డాడు’ అని చెప్పారు.ప్రియురాలు కోసం హైజాక్ డ్రామా ఆడిన ప్రియుడు చివరకు ఊచలు లెక్కిస్తున్నాడు.