Latest News Technology

సాహె ట్రంప్.. ఇన్ఫోసిస్ పై హెచ్‌1బీ ఎఫెక్ట్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్‌-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో ఆ ప్రభావం భారత ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌పై పడింది. ట్రంప్‌ నిర్ణయంతో ఇన్ఫోసిస్ ఉద్యోగుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే రెండేళ్లలో 10వేల మంది అమెరికన్లను ఉద్యోగులుగా నియమించుకోనున్నట్లు ప్రకటించింది. అంతేగాక, అమెరికాలో నాలుగు టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ హబ్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఉద్యోగుల నుంచి వీసా సంబంధిత సమస్యలను ఎదుర్కోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్ఫోసిస్‌ స్పష్టం చేసింది.

ఈ నియామకాలతో పాటు.. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, క్లౌడ్‌ అండ్‌ బిగ్‌ డేటాపై కూడా ఇన్ఫోసిస్‌ దృష్టి పెట్టనుంది. ఇన్ఫోసిస్‌ సీఈవో విశాల్‌ సిక్కా మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది ఆగస్టులో ఇండియానాలో తొలి హబ్‌ను ఏర్పాటుచేస్తామన్నారు. ఈ హబ్‌ ద్వారా 2021 నాటికిఅమెరికన్లకు 2వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. మిగతా మూడు హబ్‌లను ఎక్కడ ఏర్పాటుచేస్తామన్నది సంస్థ త్వరలోనే వెల్లడిస్తుందని తెలిపారు.

అయితే కేవలం వీసా సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోలేదని సిక్కా స్పష్టం చేశారు. గడిచిన మూడేళ్లలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, వర్చుయల్‌ రియాల్టి లాంటి టెక్నాలజీ వినియోగం పెరిగిందని, ఈ నేపథ్యంలో స్థానికులు, విదేశీ ఉద్యోగులు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలొస్తాయని సిక్కా తెలిపారు.
కాగా.. ఇన్ఫోసిస్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ లాంటి భారత కంపెనీలు హెచ్‌-1బీ వీసా నిబంధనలను ఉల్లంఘించాయని అమెరికా ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. లాటరీ విధానంలో అదనపు దరఖాస్తు జతచేయడం ద్వారా ఆ కంపెనీలు ఎక్కువ వీసాలు పొందగలిగాయని, ఇలా చేయడం అన్యాయమని పేర్కొంది. ఈ నేపథ్యంలోఇన్ఫీ తీసుకున్న తాజా నిర్ణయం ఆసక్తి రేపుతోంది.