Featured Movies Sports

‘సైనా’బయోపిక్ లో శ్రద్ధ..!

 

 

 

 

 

 

 

 

 

 

 

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్‌ నటిస్తోంది. ఈ సినిమాకి ‘సైనా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇంతకుముందు తన బయోపిక్‌లో దీపిక పదుకొణె నటిస్తే బాగుంటుందని.. ఒకప్పుడు ఆమె కూడా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణేనని సైనా తన అభిప్రాయాన్ని తెలిపింది. కానీ చిత్ర బృందం ఇందులో దీపికకి బదులు శ్రద్ధాని ఎంచుకుంది.
ఈ విషయమై శ్రద్ధా మాట్లాడుతూ.. ‘చాలా మంది అమ్మాయిలు చదువుకునే రోజుల్లోనే బ్యాడ్మింటన్‌ ఆడుంటారు. నేను ప్రపంచ నంబర్‌ వన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను.’ అని తెలిపింది. ప్రస్తుతం బ్యాడ్మింటన్‌ ఆసియా ఛాంపియన్‌షిప్‌ నిమిత్తం చైనాలో ఉన్న సైనా ఈ విషయం గురించి స్పందిస్తూ.. ‘వావ్‌ నాకు ఇప్పుడే ఈ విషయం తెలిసింది. శ్రద్ధ చాలా కష్టపడే నటి. ఆమె నా పాత్రకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉంది. అదీకాకుండా ఆమె నాకు మంచి స్నేహితురాలు కూడా. నేనూ ఆమెకు బ్యాడ్మింటన్‌ చిట్కాలు కాస్త సులువుగా నేర్పించవచ్చు. చాలా మంది నేను శ్రద్ధా కపూర్‌లా ఉంటానని చెప్తుంటారు. అది నిజంగా నాకు ప్రశంసే. ఎందుకంటే శ్రద్ధ చాలా అందంగా ఉంటుంది.’ అని చెప్పుకొచ్చింది సైనా.