Health

2నెలల్లో 242 కిలోల బరువు తగ్గిందోచ్..!


ముంబై: ఈజిప్టుకు చెందిన ఎమన్ అహ్మద్ అనే మహిళ 500 కిలోల బరువుతో బాధపడుతున్న విషయం గురించి గతంలో పలు వార్తలొచ్చాయి. ఆమె బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఎంతో మంది వైద్యులను సంప్రదించింది. ఆ క్రమంలోనే ఇండియాకు చెందిన ప్రముఖ ఒబెసిటీ సర్జన్ ముఫజల్ లక్డవాలా ఆమెకు చికిత్స చేశారు. మార్చి 7న ఆమెకు ముంబైలో ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ చేసిన ఒక నెలలోనే ఆమె 130 కిలోల వరకూ బరువు తగ్గిందని ముఫజల్ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఆమె 242 కిలోల బరువు తగ్గిందని ఆయన వెల్లడించారు. ఎమన్ గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు ఇప్పుడు ఆరోగ్యకరంగా పనిచేస్తున్నాయని చెప్పారు. ఎమన్ బరువు 150 కిలోలు చేయడానికి అవసరమైన వైద్యాన్ని అందిస్తామని ముఫజల్ లక్డవాలా తెలిపారు. 36 సంవత్సరాల ఎమన్ ఇండియాకు రావడానికి కూడా చాలా ఇబ్బందిపడ్డారు. తొలుత ఆమెను ఎక్కించుకునేందుకు ఎయిర్ లైన్స్ కంపెనీలు ఒప్పుకోలేదు. ఎట్టకేలకు ఓ కంపెనీ ఒప్పుకోవడంతో కొన్ని ప్రత్యేక సదుపాయాలతో ఆమెను ఇండియాకు తరలించారు. సైఫీ ఆసుప్రతిలో ఆమెకు ప్రస్తుతం చికిత్సనందిస్తున్నారు.