Latest News Technology

9 నెలల జీతాలిస్తాం… వెళ్ళిపోండి ఉద్యోగులకు కాగ్నిజెంట్ మెయిల్స్…

 

 

 

 

 

 

 

 

 

ట్రంప్ ఎఫెక్ట్ సాఫ్ట్ వేర్ కంపెనీలపై పడింది. దిగ్గజ సంస్థలు ఉద్యోగుల్ని వదిలించుకోనే పనిలో పడ్డాయి. మొన్న విప్రో, ఇన్ఫోసిస్..నిన్న టీసీఎస్..నేడు కాగ్నిజెంట్ లు ..రకరకాల కారణాలు చూపిస్తూ ఎంప్లాయిస్ సంఖ్యను తగ్గించుకుంటున్నాయి.

ఉద్యోగుల జీతాల భారాన్ని తగ్గించుకునేందుకు కాగ్నిజెంట్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఉన్నత స్థాయిలో ఉన్నవారిని సాదరంగా సాగనంపేందుకు రెడీ అవుతోంది. ‘డి ప్లస్’ కేటగిరి ఉద్యోగులకు మంగళవారం రాత్రి పంపిన మెయిల్స్‌లో సుహృద్భావ వాతావరణంలో సంస్థను విడిచిపెట్టేందుకు సిద్ధం కావాలని కోరింది. ఈ కేటగిరీలోకి డైరెక్టర్లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు వస్తారు.

ఉద్యోగుల కేటగిరినిబట్టి 6 లేదా 9 నెలల జీతాన్ని తీసుకుని స్నేహపూర్వకంగా సంస్థ నుంచి వెళ్ళిపోవాలని కాగ్నిజెంట్ కోరింది. డైరెక్టర్లకు 9 నెలల జీతం, ఏవీపీలు, ఎస్‌వీపీలకు 6 నెలల జీతం ఇస్తామని ప్రకటించింది.

కాగ్నిజెంట్‌లో ఇటువంటి సిబ్బంది సుమారు 1,000 మంది ఉండవచ్చునని తెలుస్తోంది. అయితే ఈ సంఖ్య గురించి కాగ్నిజెంట్ స్పందించడం లేదు.

కాగ్నిజెంట్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ‘‘కొందరు అర్హులైన లీడర్లకు స్వచ్ఛంద ఎడబాటు ప్రోత్సాహకాలను ఇవ్వజూపుతున్నాం. వీరు మా మొత్తం ఉద్యోగ బృందంలో అతి తక్కువ శాతం మాత్రమే ఉంటారు. అత్యున్నత ప్రమాణాలను అందజేసేందుకు, సుస్థిర వృద్ధికి, డిజిటల్‌వైపు వేగంగా మళ్ళేందుకు కంపెనీ అనుసరిస్తున్న వ్యూహానికి సంబంధించిన నిర్ణయమిది’’ అని స్పష్టం చేశారు.