FOOD Health

కుళ్లిన మాంసంతో బిర్యానీ..!

హోటల్లో బిర్యానీ తినే ముందు..ఒక్క క్షణం…

హైదరాబాద్ అంటే ఠక్కున గుర్తొచ్చేది దమ్ బిర్యానీ. దేశంలోనే దీనికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పార్టీయినా,పండుగైనా..ఆకేషన్ ఏదైనా బిర్యానీ తినడం కామన్. వీకెండ్ లో ఏదో హోటల్ కు వెళ్లి మటన్, చికెన్ బిర్యానీలకు ఆర్డర్ ఇవ్వలనుకుంటున్నారా.. అయితే ఒక్క క్షణం. ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు. మళ్లీ హోటల్ కు వెళ్లాలంటేనే జడుసుకుంటారు. ఇందుకు కారణం కుళ్లిన మాంసంతో వంటకాలు చేయడమే.

హైదరాబాద్ లో అపరిశుభ్ర హోటల్ కిచెన్‌లలో కలుషిత నీరు, నిల్వ ఉంచిన, కుళ్లిన మాంసంతో వంటకాలు తయారు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పలు హోటళ్లపై జరిగిన ఆకస్మిక దాడుల్లో ఈ విషయాలు బయటపడ్డాయి. నిబంధనలకు నీళ్లు వదిలిన ఐదు హోటళ్లకు జరిమానాలు విధించడంతో పాటు ఓ హోటల్ ను సీలు వేశారు. హబ్సిగూడలో అపరిశుభ్రంగా ఉన్న బిర్యానీ దర్బార్ హోటల్ కు జీహెచ్ఎంసీ అధికారులు తాళం వేసి యజమానికి పదివేల రూపాయల ఫైన్ వేశారు..రామంతాపూర్ లోని గ్రాండ్ స్వాగత్, ఐడీపీఎల్ క్రాస్ రోడ్డు దగ్గర ఉన్న సితార బార్ అండ్ రెస్టారెంట్, చక్రీపురంలోని రత్నా రెస్టారెంట్, కాప్రాలోని గ్రీన్ బావర్చీ హోటళ్లలో వంటగదులు అపరిశుభ్రంగా ఉన్నాయని వారికి జరిమానాలు విధించారు. కాప్రాలోని స్వాగత్ హోటల్ లో వండిన ఆహారపదార్థాలను భద్రపర్చారు. జీహెచ్ఎంసీ గుర్తించిన కబేళా నుంచి కాకుండా అక్రమంగా మాంసం తీసుకువచ్చారని తేలింది. ఇలా ఏడాదికో సారి కాదు… నిరంతరం తనిఖీలు చేయాలని హైదరాబాదీలు కోరుతున్నారు.